సీనియర్ కథానాయిక త్రిష గురువారం తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. నలభయ్యవ వసంతంలో అడుగుపెట్టిన ఈ అమ్మడు వన్నె తరగని అందంతో అలరారుతున్నది. ఇటీవల విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్-2’ చిత్రంలో మహారాణి కుందవై పాత్రలో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్రిష పుట్టిన రోజును పురస్కరించుకొని ఆమె నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ చిత్రం ‘ది రోడ్’ తాలూకు మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
త్రిష నటిస్తున్న తొలి లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ చిత్రమిది కావడం విశేషం. ఆరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిస్తున్న ఈ చిత్రం తన కెరీర్లో ప్రత్యేకమని త్రిష పేర్కొంది. సుదీర్ఘమైన కెరీర్లో తొలిసారి పూర్తిస్థాయి యాక్షన్ నేపథ్య చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని చెప్పింది. తమిళనాడులోని జాతీయ హైవేలపై జరిగిన కొన్ని యథార్థ సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు అరుణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.