మెగాస్టార్ చిరంజీవితో కలిసి బిగ్ బి ‘సైరా’ అంటే ‘ఔరా!’ అని చూశాం. జూనియర్ ఎన్టీఆర్ పక్కన సీనియర్ మోహన్‌లాల్ ఉంటే జనత ఘనతగా భావించింది. బన్నీ ‘తగ్గేదే లే..’ డైలాగ్‌కు ఫాజిల్ ‘పార్టీ లేదా పుష్ప?’ కౌంటర్ బాగా కనెక్ట్ అయింది. ఇలా తెలుగు సినిమాల్లోని ప్రధాన పాత్రల్లో వేరే ఇండస్ట్రీకి చెందిన తారలు కనిపించడం ఇప్పుడు జోరందుకుంది.ముఖ్యంగా అతిథి ధరించే పాత్రను అందరూ ఆశ్చర్యపోయేలా తీర్చిదిద్దుతున్నారు దర్శకులు. తాజాగా నాగ్ అశ్విన్ దర్శకుడిగా, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్-కె’లో కమల్ హాసన్ ఓ డిఫరెంట్ రోల్ పోషిస్తున్నారని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొన్నది. ఇలా మన సినిమాల్లో పక్క వాటాలోని నట దిగ్గజాలను ఎంచుకోవడంలో కథ డిమాండ్‌తో పాటు పక్కా కమర్షియల్ సూత్రాలు ఇమిడి ఉన్నాయన్నది ఇండస్ట్రీ టాక్!
Tollywood | తెలుగు సినిమాలో ‘పొరుగు’వారి వాటా ఈ మధ్య పెరుగుతున్నది. ఈ సంప్రదాయం ఎప్పట్నుంచో ఉన్నప్పటికీ ఇటీవల ఊపందుకుంది. బడ్జెట్ లెక్కలను దృష్టిలో ఉంచుకొని పక్క రాష్ర్టాల్లోనూ భారీ ఓపెనింగ్స్ రాబట్టేందుకు ఈ ఫార్ములాను ఎంచుకుంటున్నారు. అప్పట్లో ఒక సినిమా సక్సెస్ కోసం ప్రత్యేక గీతాల్లో పేరెన్నికగన్న నటులను, కథానాయికలను ఎంచుకునేవారు. ఆ పాట కోసం సదరు నటీనటుల అభిమానులు కూడా సినిమా చూస్తారని ఆశించేవారు. ఇలా ప్రత్యేక గీతాల్లో మెరిసి అభిమానులను అలరించిన నటుల్లో సూపర్ స్టార్ కృష్ణ ముందువరుసలో ఉండేవాడు. బాలకృష్ణ హీరోగా అక్కినేని నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించిన ‘గాండీవం’ సినిమాలోని ‘గోరువంక వాలగానే గోకులానికి..’ పాటలో మలయాళ నటుడు మోహన్‌లాల్ కనిపించాడు. సినిమా సంగతేమో కానీ, ఆ పాట మాత్రం సూపర్‌హిట్ అయింది. తర్వాత కొన్నాళ్లపాటూ ఎవరి సినిమా వారిదే అన్నట్టుగా సాగింది వ్యవహారం. మళ్లీ ఈ మధ్య ప్రత్యేక గీతాల్లో కాకుండా విశిష్ట పాత్రల్లో పొరుగు సేవలను వినియోగించుకుంటున్నారు.
సైరా.. గాడ్‌ఫాదర్
రెండో ఇన్నింగ్స్‌లో చిరంజీవి మెగా పెర్ఫార్మెన్స్తో అదరగొడుతున్నాడు. ఆయన నటించిన చారిత్రక ‘సైరా నరసింహారెడ్డి’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నరసింహారెడ్డి గురువు పాత్ర కోసం ఎందరినో అనుకున్నా.. చివరికి బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ను ఎంచుకున్నారు. మెగాస్టార్ స్థాయి హీరోకు ఆ రేంజ్ నటుడు గురువుగా కనిపిస్తేనే బాగుంటుందని చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఈ చిత్రంలో కర్ణాటకకు చెందిన సూపర్ హీరో కిచ్చా సుదీప్, తమిళనాడుకు చెందిన విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రల్లో కనిపించారు.
బహుభాషా చిత్రంగా తెరకెక్కిన ‘సైరా..’కు ఆయా రాష్ర్టాల్లో మంచి ఓపెనింగ్స్ ఉండాలనే లక్ష్యంతోనే నటీనటుల ఎంపికలో ఈ సూత్రాన్ని పాటించింది చిత్ర బృందం. చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రలుగా విడుదలైన ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలోనూ ఇదే ఫార్ములాను ఎంచుకున్నారు. గాడ్‌ఫాదర్‌కు వెన్నుదన్నుగా నిలిచే పాత్రలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ కనిపించాడు. నిడివి తక్కువే అయినా.. హిందీ వెర్షన్ వసూళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది.
యూనివర్సల్ ఎంట్రీ
విభిన్న దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్-కె’. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్నది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె, బిగ్ బి అమితాబ్ నటిస్తున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నుంచి లేటెస్ట్ అప్డేట్ సినీ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. మా సినిమాలో ‘యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ జాయిన్ కావడం గర్వంగా ఉందం’టూ సామాజిక మాధ్యమాల్లో చిత్ర యూనిట్ చేసిన పోస్ట్‌కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కమల్ పాత్ర తీరుతెన్నులు, ఆహార్యం గురించి అప్పుడే చర్చోపచర్చలు మొదలయ్యాయి. యూనివర్సల్ స్టార్ ఎంట్రీతో ‘ప్రాజెక్ట్-కె’పై అంచనాలు రెండింతలయ్యాయి. హిందీ, తమిళ్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని భారీ తారాగణాన్ని ఎంచుకుంటున్నాడు నాగ్ అశ్విన్.
‘ఏజెంట్’కు సాయంగా
అఖిల్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. భారీ అంచనాలతో విడుదలైన ‘ఏజెంట్’ ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇందులో రా చీఫ్ పాత్రలో మమ్ముట్టి నటించడం విశేషం. కథ బాగా నచ్చడంతో ఆయన డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. ఆయనకు కథ నచ్చితే సినిమా హిట్ అన్న సెంటిమెంట్ చిత్ర యూనిట్‌కు ఉత్సాహాన్నిచ్చింది. కానీ, ఫలితం తారుమారైంది. ఏజెంట్‌కు సాయంగా మలయాళ సూపర్‌స్టార్ రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది.
మరిన్ని చిత్రాల్లో..
బాక్సాఫీస్ దగ్గర ఇటీవల విడుదలైన ‘కస్టడీ’ సినిమాలో కోలీవుడ్ స్టార్స్ అరవింద స్వామి, శరత్‌కుమార్ కనిపించారు. గతేడాది విడుదలై సంచలన విజయం సాధించిన కమల్ హాసన్ సినిమా ‘విక్రమ్’లో పొరుగు హీరో ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో మెప్పించాడు. విజయ్ సేతుపతి విలన్‌గా అదరగొట్టాడు. పతాక సన్నివేశాల్లో సూర్య ఎంట్రీ చిత్రానికి ప్లస్ అయింది. సూర్య, విజయ్ సేతుపతి కోలీవుడ్ తారలే అయినప్పటికీ వారికంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం గమనించదగ్గ అంశం. కొన్నాళ్లు వెనక్కి వెళ్తే.. జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సూపర్‌హిట్‌గా నిలిచింది.
ఇందులో మాలీవుడ్ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్ర పోషించి మెప్పించాడు. అల్లు అర్జున్, వక్కంతం వంశీ చిత్రం ‘నా పేరు సూర్య’లో కోలీవుడ్ నటులు అర్జున్, శరత్ కుమార్ పాత్రోచిత పెర్ఫార్మెన్స్ ప్రదర్శించారు. అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి చిత్రం ‘మనం’లో అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో తళుక్కుమనడం గుర్తుండే ఉంటుంది. గతంలో కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హే రామ్’లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే! ఇంతకు చెప్పొచ్చేదేమంటే.. కథ డిమాండ్‌ను బట్టి నటీనటుల ఎంపిక ఉంటుంది. అయితే, సినిమా బిజినెస్‌ను దృష్టిలో ఉంచుకొని వీరి సెలక్షన్ ఉంటుందన్నదీ కాదనలేని సత్యం!!