‘సినిమా పట్ల నా ప్రేమ ఎల్లలు లేనిది. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మనసుకు నచ్చిన కథల్ని ఎంచుకుంటూ సినిమాల్లో కొనసాగుతాను’ అని చెప్పింది సీనియర్ నటి గౌతమి. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. నందిని రెడ్డి దర్శకురాలు. స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం గౌతమి పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలివి.
ఈ సినిమాలో నేను మీనాక్షి అనే పాత్రలో కనిపిస్తా. బాధ్యత కలిగిన అమ్మ, ప్రేమను పంచే భార్య, ఆపదలో తోడుండే మంచి మిత్రురాలు తరహాలో దర్శకురాలు నందిని రెడ్డి నా పాత్రను తీర్చిదిద్దింది. కుటుంబ సభ్యుల పట్ల ఎంతో ప్రేమను కనబరుస్తూ నా పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుంది. నా కెరీర్ ఆరంభంలో రాజేంద్రప్రసాద్‌గారితో నటించాను. మళ్లీ ఇప్పుడు ఆయనతో కలిసి తెరను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం తొలుత నన్ను స్వప్నదత్ సంప్రదించింది. నేను తప్ప ఈ పాత్రకు మరొకరు న్యాయం చేయలేరని చెప్పడంతో వెంటనే సినిమాకు అంగీకరించా.
నందిని రెడ్డి చక్కటి ప్రతిభ కలిగిన దర్శకురాలు. ఆమె ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇక స్వప్నదత్లో గొప్ప నిర్మాతకు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. అశ్వనీదత్‌గారు ఇద్దరు అమ్మాయిలను చక్కగా ప్రోత్సహిస్తూ ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. ఈ సినిమాలో సీనియర్ నటులతో తెరను పంచుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇండస్ట్రీలో ఇంతమంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు రేసులో నిలవాలంటే మరింతగా కష్టపడాలి అనుకుంటున్నా.
నిరంతరం పనిలో ఉండటాన్ని నేను బాగా ఇష్టపడతాను. మంచి పాత్రలు నన్ను వెతుక్కుంటూ రావడం అదృష్టంగా భావిస్తున్నా. నేను పొందుతున్న గొప్ప గౌరవమిది. మా అమ్మాయి ప్రస్తుతం ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తున్నది. తను కెమెరా వెనక ఉండటమే నాకు ఇష్టం. కెరీర్లో సెకండ్ ఇన్సింగ్స్, థర్డ్ ఇన్సింగ్స్‌పై నాకు నమ్మకం లేదు. సినిమానే ఫస్ట్ లవ్ అనుకుంటాను. ఏదిఏమైనా ఇన్సింగ్స్ ఆడటమే ము ఖ్యం (నవ్వుతూ). ప్రస్తుతం బోయపాటి శ్రీను ద ర్శకత్వంలో ఓ సిని మా చేస్తున్నా. అ మెజాన్ కోసం ఓ వెబ్ సిరీస్‌లో నటి స్తున్నా.