ఒక్కొక్కరు ఒక్కో పాత్రకు సూట్ అవుతారు. వాళ్ల బాడీలాంగ్వేజ్ ఆ క్యారెక్టర్లకు అతికినట్టు సరిపోతుంది. అలా కొన్ని పాత్రలకు గొప్పనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు మాత్రమే సరిపోతారు. అయిదు దశాబ్డాల పాటు అన్ని రకాల పాత్రల్లో అలరించిన గుమ్మడి వెంకటేశ్వరరావు తెలుగు సినీ ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోయారు. ఇక ఆయన కెరీర్ చివరి దశలో మాత్రం ముసలితనం పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి ఆ పాత్రలో జీవించేవాడు.
కెరీర్ పరంగా ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన గుమ్మడి సినిమా రంగంలో తన ప్రతి రోజును ఆస్వాదించానని చెబుతుండేవాడు. అయితే తన కెరీర్లో జరిగిన అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గుమ్మడి అందులో సీనియర్ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుతో అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ”. ఓ సారి చిరంజీవులు అనే చిత్రంలో నేను, రామారావు కలిసి నటిస్తున్నాం. ఆ సినిమా షూటింగ్లో ఆయనకు పెద్ద ప్రమాదమే తప్పింది.
ఆ సినిమాలో అందుడిగా నటిస్తున్న ఎన్టీఆర్ పట్టాల మీద నడిచే సన్నివేశం ఒకటి వుంది. అలా ఆయన పట్టాల మీద నడుస్తున్నప్పుడు వెనుక నుంచి రైలు వస్తుంటుంది. ఆఖరి క్షణంలో రైలు దగ్గరికి రాగానే నేను ఆయన్ని పట్టాల నుంచి పక్కకు తోసేయాలి. అదీ సీన్.. ఇప్పటి సాంకేతికత అప్పట్లో లేదు. ఎదైనా కాస్త రియాలిటీగా దగ్గరగా చేయాల్సిందే. ఎలక్ట్రిక్ రైలు వచ్చే పట్టాలపై షూటింగ్‌ను ప్లాన్ చేశారు. చిత్రీకరణ జరుగుతోంది. వెనక నుంచి రైలు వస్తోంది.
అనుకోకుండా బూటు జారిపోయి నేను పడిపోయాను. అది గమనించకుండా రామారావు క్యారెక్టర్లో లీనమైపోయి నడుస్తున్నాడు. పడిపోయిన నేను లేచివెళ్లి ఆయనకు పక్కకు నెట్టేశాను. నిజంగా ఆ రోజు గుర్తుచేసుకుంటే మళ్లీ నాకు ఒళ్లు జలదరిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు సీనియర్ నటుడు గుమ్మడి.