selvaraghavan | తమిళ చిత్ర పరిశ్రమలో జీనియస్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సెల్వరాఘవన్ వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ‘కాదల్ కొండేన్’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఆయన, తన విభిన్నమైన కథన శైలి, భావోద్వేగాలతో నిండిన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే కెరీర్ ఎంత విజయవంతంగా సాగినా, ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు తప్పలేదు.2006లో ప్రముఖ నటి సోనియా అగర్వాల్‌ను సెల్వరాఘవన్ వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఈ జంట ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే నాలుగేళ్లు గడిచిన తర్వాత, 2010లో వీరిద్దరూ విడాకులు తీసుకుని వేర్వేరు మార్గాల్లో వెళ్లిపోయారు.
ఈ విడాకులు అప్పట్లో పెద్ద చర్చకే దారితీశాయి. ఆ తర్వాత కొంతకాలానికి సెల్వరాఘవన్ దర్శకురాలు గీతాంజలిని రెండో వివాహం చేసుకున్నారు. గీతాంజలి కూడా సినీ రంగానికి చెందినవారే కావడం విశేషం. ఆమె ‘మాలై నేరత్తు మయక్కం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉండగా, చాలాకాలంగా కుటుంబంతో హ్యాపీగా ఉన్నట్టు కనిపించారు.అయితే తాజాగా గీతాంజలి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి సెల్వరాఘవన్‌కు సంబంధించిన ఫోటోలను పూర్తిగా డిలీట్ చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. పెళ్లై దాదాపు 14 ఏళ్లు గడిచిన తర్వాత ఇలా ఫోటోలు తొలగించడంతో, వీరిద్దరి మధ్య ఏదైనా విభేదాలు వచ్చాయా? విడాకుల దిశగా అడుగులు పడుతున్నాయా? అనే అనుమానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విషయంపై గీతాంజలి గానీ, సెల్వరాఘవన్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో పుకార్లు మరింత బలపడుతున్నాయి. ఇదే సమయంలో సెల్వరాఘవన్ తమ్ముడు, స్టార్ హీరో ధనుష్ కూడా ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకులు తీసుకోవడం గమనార్హం. ధనుష్ విడాకుల తర్వాత ఇప్పుడు సెల్వరాఘవన్ విషయంలోనూ ఇలాంటి వార్తలు రావడంతో, అన్నదమ్ములిద్దరూ వ్యక్తిగత జీవితంలో ఒకే తరహా పరిస్థితులను ఎదుర్కొంటున్నారా? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఉత్పన్నమవుతున్నాయి. అయితే సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా మాత్రమే తుది నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.