Vijay | తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇప్పుడు తన చివరి సినిమా పూర్తి చేసి రాజకీయ ప్రస్థానానికి సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి తన పార్టీ ద్వారా రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని సిద్ధమవుతున్న విజయ్, రాజకీయాల్లో గట్టి పాత్ర పోషించాలని చూస్తున్నారు. ఇంతలో విజయ్‌తో సినిమా చేసి నష్టపోయిన నిర్మాత పీటీ సెల్వకుమార్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారాయి. 2015లో విజయ్ హీరోగా, చింబు దేవన్ దర్శకత్వంలో రూపొందిన ‘పులి’ సినిమా అప్పట్లో భారీ అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజయం చవిచూసింది.
హన్సిక హీరోయిన్గా, శ్రీదేవి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా దాదాపు రూ.130 కోట్లు బడ్జెట్‌తో రూపొందింది. నిర్మాతలలో ఒకరైన పీటీ సెల్వకుమార్, అప్పట్లో విజయ్ మేనేజర్‌గా, పీఆర్వోగా కూడా పనిచేశారు. అయితే ఈ సినిమా తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. అభిమానులే థియేటర్లను వదిలి వెళ్లిపోయారట. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పీటీ సెల్వకుమార్, తాను 27 ఏళ్ల జీవిత సొమ్ము మొత్తం పులి సినిమాపైనే పెట్టానని, కానీ సినిమా ఫెయిలవ్వడంతో ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చిందని ఎమోషనల్ అయ్యారు. సినిమా రిలీజ్ ముందు నాకు తెలిసినవాళ్ళే కుట్ర చేసి ఐటీ రైడ్స్ చేయించారు. రిలీజ్ ఆగిపోయిందని పుకార్లు పుట్టించారు. ఫ్యాన్స్ కూడా నన్ను తిట్టారు. విజయ్‌కి ఏం కాలేదు, కానీ నేను మాత్రం పూర్తిగా నష్టపోయాను ” అని పేర్కొన్నారు.
సెల్వకుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, విజయ్ ఆ సినిమాకు రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. కానీ సినిమా ఫెయిలయ్యాక కూడా అతడు తనను కనీసం కలవలేదని ఆరోపించారు. సినిమా విడుదలైన ఐదు రోజుల వరకూ విజయ్ నన్ను కలవలేదు. నష్టపోయానన్న విషయం తెలిసినప్పటికీ, ఒక్క ఫోన్ కూడా చేయలేదు,” అని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్వకుమార్ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో వైబ్రేషన్ రేపుతున్నాయి. విజయ్ ని రాజకీయంగా ఎదురుదెబ్బ కొట్టాలని భావిస్తున్న ప్రత్యర్థులు ఈ వ్యాఖ్యలను వైరల్ చేస్తుండగా, విజయ్ అభిమానులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు.