Sayaji Shinde | టాలీవుడ్లో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన నటుడు షాయాజీ షిండే. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ భాషల్లో చాలా చిత్రాలు చేసి అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నాడు. ఎంతో కష్టంతో ఆయన ఉన్నత స్థితికి చేరుకున్నాడు. మహారాష్ట్రలోని శంకర్వాడి అనే పల్లెటూళ్లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన షాయాజీ 1995 నుండి నటించడం మొవలు పెట్టారు. మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు షిండే. ఆయన తండ్రి ఓ సాధారణ రైతు. అయితే కొన్నాళ్లకి షాయాజీ సొంతూరు విడిచిపెట్టి సతారా నగరానికి వెళ్లిపోయాడు. అక్కడే చదువుకున్నాడు.
అయితే షాయాజీ షిండేకి సినిమా అంటే పిచ్చి. అతని జీవితంలో సినిమా కష్టాలు ఉన్నాయి. నటుడిగా ప్రయత్నం చేయకముందు కొన్నాళ్లపాటు మహారాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేశారు. అప్పుడు షాయాజీ నెల జీతం రూ.165 కాగా, అందులో రూ.150 ఇంట్లో ఇచ్చి, మిగిలిన పదిహేను రూపాయలు తన ఖర్చులకి ఉంచుకునేవారట. ఆ టైంలో ఆయనకున్న డ్రీమ్ ఏంటంటే రూ.400 లు జీతం అందుకోవాలని.నీల్ కులకర్ణి అనే వ్యక్తి సహాయంతో నాటకాల్లో పనిచేయడం మొదలు పెట్టాడు. ముంబైకు వెళ్లి యాక్టింగ్ లోనూ శిక్షణ తీసుకున్నాడు. తొలుత ‘శూల్’ అనే హిందీ సినిమాలో బచ్చు యాదవ్ పాత్రను పోషించాడు. ఇందులో అతని నటనకి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులయ్యారు. ఆ తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి.
తెలుగులో టాప్ విలన్గా, ఇతర భాషల్లో విలక్షణ నటుడిగా లక్షల రూపాయల్లో పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు. ‘ఠాగూర్’ సినిమాతో తెలుగులో షాయాజీ జర్నీ స్టార్ట్ అయ్యింది. తెలుగు భాష నేర్చుకుని మరీ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం చూస్తే ఆయనకు నటనంటే ఎంత ప్యాషన్ అనేది అర్థమవుతోంది. అయితే ఒకానొక సందర్భంలో షాయాజి షిండేపై కోట శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తెలుగులో ఇంత మంచి నటులు ఉండగా, ఆయనకి అవకాశాలు ఇవ్వడం, అతనితో డబ్బింగ్ చెప్పించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాయాజీ షిండే సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తుండగా, ఇప్పుడు రాజకీయాల్లోనూ తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. కొన్ని నెలల క్రితమే ఆయన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు.