Satyadev | సినీ హీరోలంటే అందరూ ఏదో ఊహించేసుకుంటారు. ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితం, కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటూ ఫుల్ హ్యాపీగా ఉంటారని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు మొదటి సినిమాతోనే స్టార్ హీరోలు కాలేరు. కొంతమందికి కెరీర్ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. నటుడు సత్యదేవ్ కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్యే విజయ్ దేవరకొండ అన్న పాత్రతో ‘కింగ్డమ్’ చిత్రంలో మెప్పించిన సత్యదేవ్, “అరేబియా కడలి” వెబ్ సిరీస్‌తోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సత్యదేవ్ ఒకపక్క ఉద్యోగం చేసుకుంటూనే మరోపక్క ప్రొఫైల్ పట్టుకుని సినిమా ఆఫీసుల చుటూ తిరిగేవాడు.
అలా వచ్చిన చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో ఒక చిన్న పాత్ర కోసం సత్యదేవ్‌కి రోజుకు రూ.800 పారితోషికం లభించింది. అప్పుడు సినిమాల్లో వచ్చిన డబ్బులు సరిపోక, ఉద్యోగం మానలేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తుంటూ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి సినిమాతో పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ సినిమా పూర్తిచేసేంతవరకూ కూడా తన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టలేదు. రోజూ పగలంతా షూటింగ్… నైట్ షిఫ్ట్ లో జాబ్… రోజుకి రెండుగంటలు మాత్రమే నిద్ర పోయేవాడు. అలా ఆ సినిమాను పూర్తి చేశాడట సత్యదేవ్.
‘జ్యోతిలక్ష్మి’ తర్వాత పేరొచ్చినా డబ్బులు మాత్రం రాలేదు. తక్కువ పారితోషికంతోనూ మన ఊరి రామాయణం, ఘాజి, బ్లఫ్ మాస్టర్ (దీనికి పారితోషికం తీసుకోలేదు) లాంటి చిత్రాల్లో నటిస్తూ, మరోపక్క జాబ్ కొనసాగించాడు. చివరకు అవకాశాలు పెరిగి, నటుడిగా నిలదొక్కుకున్నాకే ఉద్యోగం మానేసి ఫుల్ టైమ్ నటుడిగా మారాడు. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్, ఇప్పుడు అదే దర్శకుడు వెంకటేష్ మహా తో మరోసారి జట్టుకట్టాడు. “రావ్ బహద్దూర్” అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో వయసు మీద పడిన జమీందార్ లుక్ లో కనిపించనున్నారు.ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఈ లుక్ చూసిన ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు