Satyadev | తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం థియేట్రికల్ రిలీజ్‌ల తర్వాత ఓటీటీ విడుదలల వ్యవహారం పెద్ద చర్చగా మారుతోంది. ఈ నేపథ్యంలో హీరో సత్యదేవ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తన కెరీర్లో అత్యంత ఇష్టమైన చిత్రాల్లో ఒకటైన ‘కృష్ణమ్మ’ సినిమా థియేటర్లలో విడుదలైన కేవలం ఆరు రోజులకే ఓటీటీలోకి వచ్చేసిందని, ఆ విషయం తనకు కూడా ముందుగా తెలియదని సత్యదేవ్ వెల్లడించడం సంచలనంగా మారింది. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ సినిమా విడుదల సమయంలో జరిగిన పరిణామాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేసిన ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న సమయంలోనే సినిమా ఓటీటీలోకి రావడం తనకు తీవ్ర నిరాశ కలిగించిందని చెప్పారు.
సత్యదేవ్ మాట్లాడుతూ, “‘కృష్ణమ్మ’ పెద్ద స్థాయిలో ఆడాల్సిన సినిమా. దర్శకుడు కొరటాల శివ సమర్పించిన ఈ చిత్రంపై మాకు మంచి నమ్మకం ఉంది. కానీ సినిమా శుక్రవారం విడుదలై, తర్వాతి గురువారానికే ఓటీటీలోకి వచ్చేసింది. ఆ నిర్ణయం గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు. నిర్మాతలు, ఇతర భాగస్వాములు తమ మధ్య మాట్లాడుకుని నిర్ణయం తీసుకున్నారు. నా కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్లలో ఇది ఒకటి. కానీ చాలా తక్కువ మంది మాత్రమే థియేటర్లలో చూసే అవకాశం దక్కింది” అని తెలిపారు.అంతేకాకుండా సినిమా విడుదల సమయంలో ఎదురైన పరిస్థితులను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. సినిమాకు రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి టాక్ వచ్చింది. కానీ అదే సమయంలో ఎన్నికల హడావిడి, తీవ్రమైన ఎండలు ప్రభావం చూపించాయి. ఎన్నికల కారణంగా ఒక రోజు, కర్ఫ్యూ పరిస్థితుల కారణంగా మరో రోజు ప్రభావితమయ్యాయి. అలాంటి సమయంలో సినిమా ఓటీటీలోకి వచ్చేయడం బాధ కలిగించింది అని అన్నారు.
తనకు ఈ విషయం ఎలా తెలిసిందో కూడా సత్యదేవ్ వివరించారు. నేను సోషల్ మీడియాలో థియేటర్లలో సినిమా చూడాలని పోస్టులు పెడుతున్నాను. అప్పుడొక అభిమాని మెసేజ్ చేసి ‘సినిమా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. ఇంకా థియేటర్లలో చూడమని ఎందుకు చెబుతున్నారు?’ అంటూ స్క్రీన్‌షాట్ పంపించాడు. అప్పుడు నాకు అసలు విషయం తెలిసింది. అది చూసి నిజంగా హార్ట్ బ్రేక్ అయ్యింది” అని పేర్కొన్నారు. ‘కృష్ణమ్మ’ చిత్రానికి దర్శకుడు వి.వి. గోపాలకృష్ణ దర్శకత్వం వహించగా, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరించారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.