Sarvam Maya | మలయాళ స్టార్ నటుడు నివిన్ పాలీ (Nivin Pauly) గత కొన్ని ఏండ్లుగా హిట్టు లేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. ‘ప్రేమమ్’ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న ఈ స్టార్ హీరో ఆ తర్వాత ఒక్క విజయం కూడా అందుకోలేకపోయాడు. ఆ మధ్యలో వచ్చిన యాక్షన్ హీరో బిజు (Action Hero Biju) కొంచెం ఉపశమనం అందించిన ఆశించిన స్థాయిలో విజయం రాలేదు. ఇక చాలా ఏండ్లుగా హిట్టు కోసం చూస్తున్న నివిన్కి తాజాగా బ్లాక్ బస్టర్ దక్కినట్లు తెలుస్తుంది. అతడు ప్రధాన పాత్రలో నటించిన ‘సర్వం మాయా’ (Sarvam Maya) చిత్రం తాజాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు విదేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో (GCC) ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. మొత్తం కలెక్షన్లలో దాదాపు రూ. 24 కోట్లకు పైగా కేవలం విదేశీ మార్కెట్ నుంచే రావడం గమనార్హం. మరోవైపు 2025లో కేరళలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల జాబితాలో మోహన్ లాల్ ‘L2 ఎంపురాన్’, ‘తుడరుమ్’ తర్వాత మూడవ స్థానాన్ని ఈ సినిమా కైవసం చేసుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక సాదాసీదా యువ పూజారి (నివిన్ పాలీ) జీవితంలోకి ఊహించని విధంగా ఒక ‘ఆత్మ’ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆ పూజారి చేసే వింత పనులు, పడే ఇబ్బందులు ఏంటి అనేది ఈ సినిమా కథ. దర్శకుడు అఖిల్ సత్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. చాలా కాలం తర్వాత నివిన్ పాలీ తన మార్క్ బాడీ లాంగ్వేజ్ మరియు కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరించారు. బాడీ షేమింగ్, వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కొన్న నివిన్, ఈ సినిమాతో విమర్శకుల నోళ్లు మూయించారు. ఆయనతో పాటు అజు వర్గీస్ కామెడీ టైమింగ్, రియా షిబు నటన సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి.