Priyadarshi Pulikonda | “సారంగపాణి జాతకం’ టీమ్‌తో పనిచేయడం నా అదృష్టం. ఈ ఛాన్సిచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణగారికి థ్యాంక్స్. టాలీవుడ్లో వచ్చిన గొప్ప సినిమాల లిస్ట్‌లో శివలెంక కృష్ణప్రసాద్గారి సినిమాలుంటాయి. వాటిలో ఎక్కడో ఒకచోట నాపేరు కూడా ఉంటుందంటే గర్వంగా ఉంది. రూప అందమైన నటి మాత్రమే కాదు, అద్భుతమైన నటి కూడా. అందుకే నేను కూడా ఆమె పక్కన బావున్నా. వెన్నెల కిశోర్, వైవా హర్షలతో మళ్లీ పనిచేయాలనుంది. ‘కోర్ట్’ తర్వాత నాకెరీర్‌కి ‘సారంగపాణి జాతకం’ ఓ వరం.’ అని హీరో ప్రియదర్శి అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. రూపా కొడవయూర్ కథానాయిక. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. ఇటీవలే సినిమా విడుదలైంది.
ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సినిమా సక్సెస్‌మీట్‌లో ప్రియదర్శి మాట్లాడారు. ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ ‘శివలెంక కృష్ణప్రసాద్గారి సంస్థలో సమ్మోహనం, జెంటిల్మెన్ సినిమాలు చేశా. అవి విజయాలు సాధించాయి. ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ చేశా. హ్యాట్రిక్ పూర్తయింది. పదికాలాల పాటు గుర్తుపెట్టుకునే గొప్ప సినిమాలు మా కాంబినేషన్లో రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడం ఇంకా ఆనందంగా ఉంది. ఆర్టీస్టులు, టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టారు. అచ్చమైన తెలుగువాళ్లు నటించిన తెలుగు చిత్రమిది. ఇది నా కెరీర్లోనే స్పెషల్ మూవీ.’ అని చెప్పారు. ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా ఇదని, మంచి టాక్‌తో దూసుకుపోతున్నదని, ఫ్యామిలీతో ఈ సినిమా చూస్తే వచ్చే కిక్ వేరేలా ఉంటుందని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. ఇంకా కథానాయిక రూపా కొడవయూర్, వెన్నెల కిశోర్, అవసరాల శ్రీనివాస్, వైవా హర్ష, డీవోపీ పీజీ విందా కూడా మాట్లాడారు.