‘తెలుగు ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. శ్రీమన్నారాయణ, 777 ఛార్లీ, సప్తసాగరాలు దాటి సైడ్ ఏ.. చిత్రాలను ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు ‘సప్తసాగరాలు దాటి సైడ్ బి’ కూడా మిమ్మల్ని మెప్పిస్తుంది’ అన్నారు రక్షిత్శెట్టి. ఆయన కథానాయకుడిగా నటించిన ‘సప్తసాగరాలు దాటి సైడ్ ఏ’ చిత్రం గత సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తాజాగా ఈ సినిమా రెండో భాగం ఈ నెల 17న విడుదల కానుంది. పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రుక్మిణీ వసంత్, చైత్ర జె ఆచార్ నాయికలుగా నటించిన ఈ చిత్రానికి హేమంత్రావు దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘రెండో భాగం చాలా భిన్నంగా ఉంటుంది. తొలిభాగానికి కొనసాగింపుగా కథ నడుస్తుంది. హృదయాన్ని స్పృశించేలా సన్నివేశాలుంటాయి’ అని చెప్పారు. మను, ప్రియ జంట ప్రణయగాథ మనసులను హత్తుకుంటుందని కథానాయిక రుక్మిణీ వసంత్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో నిర్మాత వివేక్ కూచిభొట్ల పాల్గొన్నారు.