Sanya Malhotra | ‘అన్నప్రాశన నాడే ఆవకాయ తిన్నట్టు’ తన అరంగేట్రం సినిమాలోనే రకరకాల సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబుతున్నది ‘దంగల్’ ఫేమ్ సాన్య మల్హోత్ర. ‘మొదటి సినిమాలోనే ఆమీర్‌ఖాన్ వంటి నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే చెప్పినంత తేలిక కాదు. మల్లయోధురాలి పాత్ర కావడంతో శారీరకంగా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చేది. అదే సమయంలో భావోద్వేగాలు పలికించే సమయంలోనూ మానసికంగా సిద్ధమవ్వాల్సి వచ్చేది. ఒక్క సినిమానే పది చిత్రాల అనుభవం ఇచ్చింద’ని చెప్పుకొచ్చింది సాన్య. తాజాగా షారుఖ్‌ఖాన్ ‘జవాన్’ సినిమాలోనూ కీలక పాత్ర పోషించే అవకాశం కొట్టేసింది. పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడాలు తనకు ఉండవంటున్నది సాన్య. ‘నా దగ్గరికి ఎవరు సినిమా అవకాశం అని వచ్చినా.. ముందుగా పూర్తి స్క్రిప్ట్ చదువుతాను.
ఇప్పటికైతే నేను చేసినవి తక్కువ సినిమాలే కావొచ్చు. కానీ, నేను పోషించాల్సిన పాత్ర గతంలో చేసినవాటికి భిన్నంగా ఉండటంతోపాటు ప్రాధాన్యం ఉంటేనే ఓకే చెబుతాను’ అంటున్నదామె. ఇటీవల సాన్య ప్రధాన ప్రాతగా ఓటీటీలో విడుదలైన ‘కట్హల్’ ఆమెకు మంచిపేరు తెచ్చింది. ‘జవాన్’తోపాటు 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో మనదేశ ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్ షా బయోపిక్ ఆధారంగా నిర్మితమవుతున్న ‘సామ్ బహదూర్’ చిత్రంలోనూ సాన్య నటిస్తున్నది.