సంతోష్ శోభన్, ప్రియ భవానీశంకర్ జంటగా నటించిన సినిమా ‘కళ్యాణం కమనీయం’. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14న తెరపైకి రాబోతున్నది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలు తెలిపారు హీరో సంతోష్ శోభన్. ఆయన మాట్లాడుతూ..“ఏక్ మినీ కథ’ సినిమా చేస్తున్న సమయంలో దర్శకుడు అనిల్ ఈ కథ వినిపించారు. సహజత్వానికి దగ్గరైన చిత్రమిది. ఈ కథలో ప్రేక్షకులు తమని తాము పోల్చుకోవచ్చు. ఉద్యోగం లేని భర్త వల్ల ఒక భార్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది ప్రధానాంశం. తమ వైవాహిక జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ఈ కొత్త జంట ఎలా ఎదుర్కొంది అనేది చూపిస్తున్నాం.
చాలా సినిమాలు పెండ్లితో ముగిస్తే…ఈ సినిమా పెండ్లయ్యాక ప్రారంభమవుతుంది. ఇదొక సినిమాలా కాకుండా ఒక జీవితాన్ని తెరపై చూస్తున్నట్లు ఉంటుంది. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో నటించాను. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలు సినిమాటిక్‌గా ఉంటాయి గానీ..ఇది నిజాయితీగా ప్రవర్తించే క్యారెక్టర్. శృతి పాత్రలో ప్రియ భవానీశంకర్ నటన మెప్పిస్తుంది. తను జీవితంలో చూసిన అంశాల స్ఫూర్తితో దర్శకుడు అనిల్ కుమార్ ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. ప్రభాస్ అన్నయ్య నా కెరీర్లో ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రంలో పాటలన్నీ కథతో పాటే సాగుతాయి. శ్రావణ్ భరద్వాజ్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. యూవీ నా కుటుంబ సంస్థ లాంటిది. ఇక్కడ మూడు చిత్రాలు చేశాను. మరో 30 సినిమాలైనా చేసేందుకు సిద్ధం. సంక్రాంతికి సినిమా విడుదల చేసుకోవాలి అనేది నా కల. అది ఈ సినిమాతో తీరుతున్నది. నా చిత్రంతో పాటు స్టార్స్ సినిమాలు వస్తున్నాయి. నేనైతే ఒక ఆడియన్‌గా ఈ పండుగకు వస్తున్న అన్ని చిత్రాలు చూస్తాను.’ అన్నారు.