‘మన సమాజంలో చాలా మంది ఎదుర్కొంటున్న మేల్ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూని వినోదాత్మకంగా చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించాం. సమస్యపై అవగాహన కల్పిస్తూ చిన్న సందేశం కూడా ఉంటుంది’ అన్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ఆయన నిర్ధేశకత్వంలో విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సంతానప్రాప్తిరస్తు’. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు సంజీవ్ రెడ్డి విలేకరులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
కృష్ణవంశీ ‘మహాత్మ’ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టానని, హిందీలో చేసిన ఇండిపెండెంట్ మూవీ ‘లాగిన్’కు మంచి గుర్తింపు దక్కిందని, అల్లు శిరీష్‌తో ‘ఏబీసీడీ’ చిత్రాన్ని, రాజ్‌తరుణ్‌తో ‘అహా నా పెళ్లంట’ వెబ్‌సిరీస్‌ను రూపాందించానని తెలిపారు. మన సమాజంలో సంతానలేమి సమస్యతో చాలా మంది దంపతులు బాధపడుతుంటారని, అయితే మేల్ ఫెర్టిలిటీ ఇష్యూని చర్చిస్తూ తెలుగులో రాబోతున్న తొలి చిత్రమిదని సంజీవ్ రెడ్డి పేర్కొన్నారు.
కేవలం సమస్య గురించి చెబితే ఓవర్ డ్రామాటిక్‌గా ఉంటుందని, అందుకే చక్కటి వినోదంతో సమస్యను చర్చించామని ఆయన తెలిపారు. ఫెర్టిలిటీ ఇష్యూ అనేది మాట్లాడకూడని అంశం కాదని, నేటి సమాజంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య అని చెప్పారు. కుటుంబమంతా కలిసి చూసేలా చిత్రాన్ని రూపొందించామని, ఇలాంటి సెన్సిటివ్ కాన్సెప్ట్‌ను చక్కటి డిగ్నిటీతో చెప్పే ప్రయత్నం చేశామని, సమస్యను ఎగతాళి చేయలేదని సంజీవ్ రెడ్డి వివరించారు.