Sanskrit Movies | సంస్కృతం.. మనదేశానికే చెందిన భాష. ఒకప్పుడు భారత్ అంటే సంస్కృతమే. సంస్కృతంపై హిందీ, ఇంగ్లిష్ దాడి పెరిగిపోతుండటంతో.. ఆ ప్రాచీన భాషకు పట్టం కట్టేందుకు కొందరు కంకణం కట్టుకున్నారు. పుస్తకాల నుంచి సినిమాల వరకూ అన్నిటా సంస్కృతానికి పెద్దపీట వేస్తున్నారు. ప్రత్యేకించి క్లబ్‌లు కూడా ఏర్పడుతున్నాయి.
‘ఒక భాషను నేర్చుకోవడం అంటే.. ఆ భాషతో ముడిపడిన సంస్కృతిలోకి అడుగుపెట్టడమే, దాన్ని మనసా వాచా పాటించడమే’ అంటారు పెద్దలు. అఖండ భారతంలో దేదీప్యమానంగా వెలుగొందింది సంస్కృతం. ఒకప్పుడు సంస్కృతం భారతీయ సంస్కృతికి మూలం. జాతీయ భావనకు పునాది. కాలం మారింది. జనం కట్టుబాట్లు తెంచుకున్నారు. పరాయి సంస్కృతి పాగా వేసింది. సనాతన ధర్మంపై దాడి మొదలుపెట్టింది. జాతీయ భాషగా హిందీని ప్రకటించాలని కొందరు.. రెండో అధికారిక భాషగా ఇంగ్లిష్‌ను ప్రకటించాలని మరికొందరు పోరాటాలు చేస్తున్నారు. సంస్కృతాన్ని పట్టించుకుంటున్న వారే కరువయ్యారు. ఆ వివక్షను అధిగమించడానికి సంస్కృతం సినిమాలు పురుడుపోసుకుంటున్నాయి. సంస్కృతం మాట్లాడే క్లబ్బులు ఏర్పడుతున్నాయి. సంస్కృత పుస్తకాల ముద్రణ జరుగుతున్నది. ప్రాచీన భాషకు ప్రాణం పోసేందుకు ఎవరికి తోచిన పని వారు చేస్తున్నారు.
సంస్కృత భాషలో ఓ సినిమా తీయాలని ఎప్పటినుంచో అనుకున్నారు దర్శకుడు చిన్మయ్ సుధీర్ షిండే. సర్వశక్తులూ కూడగట్టి ‘బాలభూషణాని’ అనే చిత్రం నిర్మించారు. ఇటీవల ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్ క్వీర్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా బాలభూషణాని షార్ట్ ఫిల్మ్‌ను ప్రదర్శించారు. క్వీర్ సభ్యులతో సంస్కృతంలో రూపొందించిన మొదటి సినిమా ఇది. బాలభూషణాని అంటే సంస్కృతంలో ‘పిల్లల ఆభరణాలు’ అని అర్థం. ఈ చిత్రం విమర్శకుల మన్ననలు పొందింది. దేవ భాషను కాపాడుకునే గొప్ప ప్రయత్నం అంటూ కితాబిచ్చారు. ‘సమాజం, ముఖ్యంగా సనాతన ధర్మం ఎల్జీబీటీక్యూఐఏ కమ్యూనిటీని ఇంకా అంగీకరించలేదు. అందుకు సరైన అవగాహన లేకపోవడమే కారణం. అంపశయ్యపై ఉన్న సంస్కృతాన్ని బతికించుకునేందుకు నాకు సినిమా తప్పితే మరో మార్గం లేదు. అందుకే మన సమాజం చీదరించుకునే ఎల్జీబీటీక్యూఐఏ సంఘంతోనే ఈ షార్ట్‌ఫిల్మ్ చేశాను. ఈ సినిమాలోని నటులంతా సంస్కృతంలో ప్రావీణ్యం ఉన్నవారే. వర్క్‌షాపులు నిర్వహించి, అందర్నీ ఓ చోట చేర్చి, చిత్రానికి ప్రాణం పోశాను’ అంటున్నాడు చిన్మయ్ సుధీర్.
భారతీయ కళ కూడియాట్టమ్పై కేరళలో రూపొందించిన అనురక్తి (2017) సినిమాలో ఒక పాట పూర్తిగా సంస్కృతంలో ఉంటుంది. ఢిల్లీలో జరిగిన హాబిటాట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సంస్కృత చిత్రం ‘తయా’ ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంది. స్త్రీ గురించి మాట్లాడే ఈ సినిమా బెంగళూరు, కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శితమైంది. కేవలం సంస్కృత సినిమాలను ప్రోత్సహించడానికి ఉజ్జయినిలో రాష్ట్రీయ సంస్కృత చలనచిత్ర ఉత్సవ్ (ఫిల్మ్ ఫెస్టివల్) ఏర్పడింది.
మన పూర్వికుల చరిత్రంతా సంస్కృతంలోనే ఉండేది. ఇప్పుడు శోధించినా సంస్కృతంలో పుస్తకాలు దొరికే పరిస్థితి లేదు. స్పానిష్ ఇతిహాసంపై బాగా పేరొందిన పుస్తకం ‘డాన్ క్విక్సోట్’. ఈ పుస్తకాన్ని సంస్కృత పండితులు నిత్యానంద శాస్త్రి, జగద్ధర్ జాదూ సంస్కృతంలోకి అనువదించారు. గత ఏడాది స్పెయిన్‌కు చెందిన ‘ఇన్స్టిట్యూటో సెర్వాంటెస్’ డైరెక్టర్ జనరల్ లూయిస్ గార్కా మోంటెరో ఢిల్లీని సందర్శించినప్పుడు ‘డాన్ క్విక్సోట్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఐర్లాండ్‌కు చెందిన రట్జర్ కోర్టెన్హోరస్ట్ మన ప్రాచీనభాషను నేర్చుకొని, గొప్ప సంస్కృత పండితుడయ్యాడు. రష్యాలోని మాస్కో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ శ్రీమాన్ బోరిస్ జఖారిన్ సంస్కృతంలో ఎన్నో పుస్తకాలు రాశారు. అనేక పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సంస్కృత పాఠశాల ఉంది. గూగుల్ సంస్థ ఇటీవల సంస్కృతం సహా ఎనిమిది భారతీయ భాషలను ‘గూగుల్ ట్రాన్స్‌లేట్’లో చేర్చింది. మంచి మార్పే. శుభం.
విదేశాలు సైతం మన ప్రాచీన భాష విలువను గుర్తించడంతో.. కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచింది. ‘నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ)’ కమిటీ పిల్లలకు సంస్కృతాన్ని తృతీయ భాషగా బోధించాలని ప్రతిపాదించింది. ‘సంస్కృత భారతి’ అనే ఎన్జీఓ తల్లిభాష పునరుజ్జీవం కోసం కృషి చేస్తున్నది. ఈ సంస్థ గుజరాత్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు శ్లోకాలు, నీతి కథలను సంస్కృతంలో చెప్పాలని అభ్యర్థిస్తున్నది. కోల్‌కతాలోని సంస్కృత కళాశాల, విశ్వవిద్యాలయం, లక్నోలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సంస్కృతం బోధిస్తున్నారు. ఐఐటీల్లో సంస్కృతం పూర్తిస్థాయిలో బోధించాలనే డిమాండ్ పెరుగుతున్నది.