గత ఏడాది తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. హిందీ వెర్షన్లో అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా నటించనున్నారు. అనీష్బాజ్మీ దర్శకత్వం వహిస్తారు. హిందీ రీమేక్‌ను కూడా అగ్ర నిర్మాత దిల్‌రాజు తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే విద్యాబాలన్‌ను ఓ కథానాయికగా ఖరారు చేశారు.
మరో నాయికగా రాశీఖన్నాను ఎంపిక చేశారని తెలిసింది. తెలుగులో మీనాక్షి చౌదరి పాత్రలో రాశీఖన్నా కనిపించనుంది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ పంజాబీ సొగసరి మరో భారీ ఆఫర్‌ను దక్కించుకోవడం విశేషం. గత ఏడాది తెలుగులో ‘తెలుసుకదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది రాశీఖన్నా. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ ఫలితం నిరాశపరచింది. ఆమె పవన్‌కల్యాణ్ సరసన కథానాయికగా నటించిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమాపై రాశీఖన్నా భారీ అశల్ని పెట్టుకున్నది.