Venkatesh | ‘నాలైఫ్లోనున్న ఆ ప్రేమ పేజీ తీయనా.. పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా.. ట్రైనర్‌గా నేనుంటే ట్రైనీగా వచ్చిందా కూనా.. వస్తునే వెలుగేదో నింపింది ఆ కళ్లలోనా.. చిత్రంగా ఆ రూపం.. చూపుల్లో చిక్కిందే.. మత్తిచ్చే ఓ ధూపం.. ఊపిరిలో జల్లిందే..’ ఈ సాహిత్యం వింటే ప్రేమించిన అమ్మాయిని గుర్తు చేసుకుంటూ అబ్బాయి పాడే పాట అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అయితే.. దర్శకుడు అనిల్ రావిపూడి ఇంకాస్త కొత్తగా ఆలోచించాడు.
తన ప్రేయసి జ్ఞాపకాలను భార్యతో పంచుకుంటూ భర్త పాడే పాటగా దీన్ని చిత్రీకరించాడు. ఆ భర్త విక్టరీ వెంకటేశ్ కాగా.. భార్య ఐశ్వర్య రాజేష్. ఇక ప్రేయసి ఎవరో తెలిసిందేగా.. మీనాక్షి చౌదరి. రానున్న సంక్రాంతికి సందడి ఏ స్థాయిలో ఉండనుందో ఈ పాటతో చెప్పేశారు ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీమ్. ప్రచారంలో భాగంగా ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, తొలిపాటగా విడుదలైన ‘గోదారి గట్టు’కు అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో గురువారం విడుదలైన ఈ రెండో పాట.. తొలిపాటను మించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపరచి, ప్రణవి ఆచార్యతో కలిసి ఆలపించారు. వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి.