‘సినీరంగంలో కేవలం పదిశాతం సక్సెస్ మాత్రమే ఉంటుంది. అయినా మా డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా మాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇండస్ట్రీలో అరుదైన విషయమిది’ అన్నారు అగ్ర నిర్మాత దిల్‌రాజు. ఆయన నిర్మాణంలో వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా శనివారం డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్‌ను ఏర్పాటు చేశారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘అందరు అనుకుంటున్నట్లు సినిమా విజయానికి బడ్జెట్ కాదు..మంచి కథలే ముఖ్యం. కథల్ని నమ్ముకొనే గతంలో మేము ఎన్నో విజయాలు పొందాం. అయితే గత నాలుగైదేళ్లుగా కాంబినేషన్స్ అనుకుంటూ తడబడుతున్నాం. ఈ తరుణంలో దర్శకుడు అనిల్ రావిపూడి మాకు కొత్త దారి చూపించారు.
ఈ సినిమా సెన్సేషనల్ హిట్. అనిల్‌తో పనిచేయడం చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. ఎక్కడో పడిపోతున్న మమ్మల్ని పైకి తీసుకొచ్చి నిలబెట్టాడు. ఇక ముందు కూడా అద్భుతమైన సినిమాలు చేస్తాం’ అన్నారు. ఓ ప్రాంతీయ చిత్రానికి మూడొందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చూడటం ఆనందంగా ఉందని, దిల్‌రాజు సంస్థ కొన్ని తరాల పాటు గొప్ప సినిమాలు తీయాలని దర్శకుడు అనిల్ రావిపూడి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్స్ సాయికృష్ణ, రాజేష్, హరి, శోభన్,న ఎల్వీఆర్ తదితరులు పాల్గొన్నారు.