Sanjay Dutt | బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు హిందీ చిత్రాలలో నటించి అలరించిన సంజయ్ ఇప్పుడు సౌత్ పరిశ్రమలో కూడా నటిస్తూ అలరిస్తున్నాడు. ముఖ్యంగా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన ప్రత్యేకతను నిరూపించుకుంటున్నారు. ‘కేజీఎఫ్’ లో అధీరా పాత్రతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సంజయ్ దత్, ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా ఆయన కన్నడ చిత్రం ‘కేడీ – ది డెవిల్’ ప్రమోషన్లో భాగంగా మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సంజయ్ దత్ మాట్లాడుతూ .. మార్పులకి అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. సౌత్ ఇండియన్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాల్లో వచ్చిన మార్పులను అన్ని భాషల వారు ఆచరిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మిస్ అవుతుంది. ఇప్పుడు సినిమాలన్నీ కూడా నెంబర్స్ చుట్టూ తిరుగుతున్నాయి. మూస పద్ధతిని పక్కన పెట్టకుండా, కొన్ని విషయాలని పట్టుకొని పోతే నష్టం మరింత ఉంటుందని సంజయ్ దత్ హెచ్చరించాడు. నాకు ఈ ఇండస్ట్రీలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, సంజీవ్ కుమార్ లాంటి గొప్ప నటులతో పని చేసిన అనుభవం ఉంది. అప్పట్లో స్క్రిప్ట్‌పై ఓ సీరియస్ డిస్కషన్ ఉండేది. అందరూ కలిసి చర్చించేవాళ్లం. అందుకే అవి క్లాసిక్స్ అయ్యాయి అన్నారు.
బాలీవుడ్లో వరుసగా పెద్ద హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతుండగా, సంజయ్ దత్ గతంలోనూ ఫిల్మ్ మేకర్స్‌పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రానున్న రోజులలో మారని పక్షంలో తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వస్తుంది అని హెచ్చరించారు. అయితే ఇప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని ఆయన వాపోయారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో కంటెంట్, కథ, టెక్నికల్ స్టాండర్డ్ లు గణనీయంగా మెరుగయ్యాయన్న విషయం పట్ల సంజయ్ దత్ క్లారిటీగా మాట్లాడారు.సౌత్ సినిమాలు అనేవి ఇప్పుడు దేశానికి మార్గదర్శకాలు అవుతున్నాయి. బాలీవుడ్ మెరుగుపడాలి అంటే ఇదే దారిలో నడవాలి అని వ్యాఖ్యానించారు. సంజయ్ దత్ లాంటి సీనియర్ నటుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.