Chiranjeevi | 79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఆగస్ట్ 6న ఫీనిక్స్ ఫాండేషన్, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మెగాబ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ను ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఆయనతో పాటు యువ హీరో తేజ సజ్జా, కథానాయిక సంయుక్తమీనన్ అతిథులుగా హాజరయ్యారు. చుక్కపల్లి శంకర్ రావు స్మారకంగా ఏర్పాటు చేసిన నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో 800 మంది వరకు పాల్గొన్నారని, సేకరించిన రక్తాన్ని భారత సైన్యానికి విరాళంగా అందించబోతున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఈ బ్లడ్ క్యాంప్‌ను జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించారు. చిరంజీవి తన షూ విప్పి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం తిరిగి షూ వేసుకునే సమయంలో కొంత ఇబ్బంది ఎదురయ్యింది. ఇది గమనించిన చుట్టు పక్కల వారు వెంటనే సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అదే సమయంలో పక్కనే ఉన్న హీరోయిన్ సంయుక్త మేనన్ స్వయంగా మెగాస్టార్‌కు షూ తొడిగేందుకు ముందుకు రావడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. అయితే చిరంజీవి నవ్వుతూ అలా చేయవద్దని వారించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్స్ సంయుక్త చూపిన వినయం, సంస్కారం అద్భుతం అంటూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చిరంజీవి నిరాకరించినా, ఆమె చూపిన గౌరవానికి సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. సంయుక్త మేనన్ తెలుగులోకి భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా, ఆ తర్వాత బింబిసార, విరూపాక్ష, సార్ సినిమాలతో వరుసగా హిట్లు అందుకుంది. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’ కథానాయికగా నటిస్తోంది. అలాగే పూరి జగన్నాథ్-విజయ్ సేతుపతి కాంబినేషన్లో రూపొందుతున్న మరో చిత్రంలోనూ ప్రధాన పాత్రలో నటించనుంది. ఇక అఖండ 2 లోనూ ఆమె కీలక పాత్ర పోషించనుందన్న ప్రచారం నడుస్తోంది, కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.