BRO | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ రోల్లో కనిపించిన సినిమా ‘బ్రో: ది అవతార్’. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కించారు. ఇది తమిళంలో భారీ హిట్ సాధించిన ‘వినోదయ సీతం’ సినిమాకు తెలుగు రీమేక్‌గా రూపొందింది. జీవితంలో “సమయం” అనే కాన్సెప్ట్ చుట్టూ తిరిగే ఈ సినిమా భావోద్వేగాలతో నిండి ఉన్నప్పటికీ, తమిళంలో సాధించిన విజయం తెలుగులో రిపీట్ కాలేదు. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గ మాస్ ఎలిమెంట్స్ లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై అంతగా స్పందించలేదు.
అయితే, సినిమా విడుదల సమయంలోనే సముద్రఖని ‘బ్రో 2’ గురించి సూచనలు ఇచ్చాడు. తాజాగా “కాంత” సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న సముద్రఖని, మళ్లీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆయన.. “బ్రో 2 స్క్రిప్ట్ రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు ఒకే అంటే, అప్పుడే సినిమా సెట్స్‌పైకి వెళుతుంది,” అని వెల్లడించాడు. ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత సినిమాలకు విరామం ఇవ్వొచ్చని వార్తలు వచ్చినప్పటికీ, ఆయన స్వయంగా ‘ఓజీ’ సినిమా ప్రీక్వెల్, సీక్వెల్ ప్లాన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో పవన్ సినీ కెరీర్‌కి ఇంకా ముగింపు రాలేదని స్పష్టమవుతోంది.
ఇప్పుడు సముద్రఖని చేసిన ప్రకటనతో ‘బ్రో 2’ కూడా నిజంగా రూపుదిద్దుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, సమయం దొరికినప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ప్లాప్ టాక్ తెచ్చుకున్న ‘బ్రో’ కు సీక్వెల్‌గా వస్తున్న ఈ ‘బ్రో 2’ ప్రేక్షకులను మెప్పించగలదా? పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అన్నదే ఇప్పుడు ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.