Samuthirakani | తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విజయ్-త్రిష వివాదంపై ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని ఎట్టకేలకు స్పందించారు. ఆయన నటించిన తాజా చిత్రం కార్మేని సెల్వం ప్రమోషన్ల సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో విజయ్ , త్రిష కలిసి కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే సమయంలో సముద్రఖని కొందరితో ఈ విషయం గురించి మాట్లాడుతున్న వీడియో బయటకు రావడంతో వివాదం మొదలైంది. ఆ వీడియోలో విజయ్-త్రిష ప్రవర్తనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది.అయితే, ఈ ప్రచారాలపై సముద్రఖని క్లారిటీ ఇస్తూ.. “నేను విజయ్ను ఎప్పుడూ అవమానించలేదు. నా మాటలను సందర్భానికి సంబంధం లేకుండా కట్ చేసి, తప్పుగా ప్రచారం చేశారు” అని పేర్కొన్నారు.
ఆ వీడియోను ఎవరో కావాలనే రికార్డ్ చేసి వైరల్ చేశారని ఆయన ఆరోపించారు. విజయ్‌కు తాను మొదటి నుంచే మద్దతుగా ఉన్నానని, అందుకే కొన్ని విషయాల్లో బాధ వ్యక్తం చేయడం సహజమని సముద్రఖని అన్నారు. వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయడం వల్ల ఎవరికి ఉపయోగం లేదని, ఇలాంటి చర్యలు రాజకీయంగా కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడ్డారు.అంతేకాకుండా, తాను చెప్పిన మాటల్లో నిజాయితీ మాత్రమే ఉందని, వాటిపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వివరణతో ఈ వివాదానికి కొంతవరకు తెరపడినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.
మొత్తానికి, సముద్రఖని ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదం మరో మలుపు తీసుకుంది. ఇప్పుడు ఈ అంశంపై విజయ్ లేదా త్రిష నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది. కాగా, విజయ్ త్రిష కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల విజయ్ భార్య స్టేట్మెంట్తో వీరి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.