Ganja shankar | సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) – సంపత్ నంది (Sampath Nandi) కాంబినేషన్లో వచ్చి మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్ట్ ‘గాంజా శంకర్’ (Ganja shankar). మాస్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా తెలంగాణ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో మధ్యలోనే ఆగిపోయింది. అయితే దీనికి సంబంధించి అసలు కారణం వెల్లడించాడు దర్శకుడు సంపత్ నంది.
ఆయన మాట్లాడుతూ.. ‘గాంజా శంకర్’ టైటిల్ మార్చమని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు, నిర్మాతకు, హీరోకి నోటీసులు వచ్చాయి. అందుకే ఆ సినిమా ఆపేశాం. నేను ఏం చెప్పాలి అనుకున్నానో పోలీసులకు తెలియదు. గాంజాకు వ్యతిరేకంగానే ఈ సినిమా తీయబోతున్నాను. కానీ టైటిల్ అభ్యంతరకరంగా ఉందని మధ్యలోనే ఇలా నోటీసులు ఇచ్చారు. దీంతో ఆ ప్రాజెక్ట్‌ను ఆపి శంకరుడిపైనే (ఓదెలా 2) సినిమా తీస్తున్నానంటూ సంపత్ నంది చెప్పుకోచ్చాడు.
అసలు ఏం జరిగిందంటే.. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు ‘గాంజా శంకర్’ సినిమా బృందానికి నోటీసులు జారీ చేశారు. టైటిల్లోని ‘గాంజా’ అనే పదాన్ని తొలగించాలని సూచించారు. చిత్రంలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన అనుచిత దృశ్యాలు ఉంటే, ఎన్డీపీఎస్-1985 చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ టైటిల్ విద్యార్థులు, యువతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని, అందువల్ల గంజాయికి సంబంధించిన సన్నివేశాలు లేదా సంభాషణలు లేకుండా చూడాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే ఈ నోటిసులు ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌నే ఆపేశాడు దర్శకుడు సంపత్ నంది.