Maa Inti Bangaram | టాలీవుడ్ నటి సమంత రుత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ యాక్షన్ డ్రామా, రిలీజ్‌కు ముందే పెట్టిన పెట్టుబడిని పూర్తిగా రికవరీ చేసుకొని లాభాల బాట పట్టింది. ఈ విషయాన్ని ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై చిత్ర నిర్మాత హిమాంక్ దువ్వూరు అధికారికంగా ప్రకటించారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాను రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్ల మధ్య బడ్జెట్‌తో నిర్మించారు. అయితే థియేట్రికల్, నాన్-థియేట్రికల్ (ఓటీటీ, శాటిలైట్) హక్కులకు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడటంతో, అన్ని డీల్స్ రిలీజ్ వారంలోనే విజయవంతంగా క్లోజ్ అయినట్లు తెలుస్తుంది. ఫలితంగా సినిమా విడుదలకు ముందే సేఫ్ జోన్లోకి వచ్చేసింది.
ప్రస్తుత మార్కెట్లో ఒక మహిళా ప్రధాన తెలుగు చిత్రానికి ఇంతటి క్రేజ్ రావడం బలమైన కమర్షియల్ సిగ్నల్ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా నిర్మాత హిమాంక్ దువ్వూరు మాట్లాడుతూ సినిమా స్క్రీన్‌పైకి రాకముందే పూర్తి పెట్టుబడిని రికవర్ చేయడం ‘మా ఇంటి బంగారం’పై మార్కెట్‌కు ఉన్న నమ్మకానికి నిదర్శనం. సమంత పవర్ఫుల్ ప్రెజెన్స్, మా కథపై మేం పెట్టుకున్న నమ్మకం ఈ రోజు కమర్షియల్‌గా రిఫ్లెక్ట్ అవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ సమంతతో ‘జబర్దస్త్’, ‘ఓ బేబీ’ తర్వాత నాకు ఇది మూడో సినిమా. నాపై నమ్మకంతో తనే ఈ ప్రాజెక్ట్‌ను నా దగ్గరకు తీసుకువచ్చింది. జూన్ 19న థియేటర్లలో మీరు సమంతను పది రెట్లు ఎక్కువ పవర్‌ఫుల్‌గా చూస్తారు. ఇది నా ప్రామిస్ అంటూ చెప్పుకోచ్చింది. 2023లో వచ్చిన ‘ఖుషి’ చిత్రం తర్వాత సమంత పూర్తిస్థాయిలో వెండితెరపై కనిపించనున్న చిత్రమిదే. 2024లో వరుణ్ ధావన్‌తో కలిసి ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లో మెరిసిన ఆమె, 2025లో తన సొంత నిర్మాణంలో వచ్చిన ‘శుభం’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. మళ్లీ మూడేళ్ల తర్వాత థియేటర్లలో ఆమె నటిస్తున్న లీడ్ రోల్ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.