అగ్ర కథానాయిక సమంత నటిస్తూ, స్వీయ నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందినీ రెడ్డి దర్శకురాలు. మే 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం ‘తస్సాదియ్యా’ అంటూ సాగే తొలి గీతాన్ని విడుదల చేశారు. సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ గీతానికి రెహమాన్ సాహిత్యాన్నందించారు. చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ ఆలపించారు. ఈ పాటలో సమంత ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో హుషారుగా కనిపించింది.
‘రెండు జళ్ల ఓ మొలకా పెళ్లి కూతురువైపోయావే.. అయినా ఇంకేం మారలేదే అట్టాగే ఉన్నావు.. నువ్వు నీ గడసుతనం అందరికీ తెలిసిందిలే..’ అంటూ పెళ్లి నేపథ్యంలో ఆహ్లాదభరితంగా సాగిందీ పాట. కుటుంబమంతా ఆస్వాదించే ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ ఇదని మేకర్స్ తెలిపారు. దిగ్నాథ్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్, నిర్మాతలు: సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు, దర్శకత్వం: నందినీ రెడ్డి.