శృతిహాసన్ నటిగా మారి 17ఏండ్లయింది. సోహన్షా దర్శకత్వంలో 2009లో వచ్చిన బాలీవుడ్ సినిమా ‘లక్’ నటిగా ఆమె తొలి సినిమా. ఆ తర్వాత అదే ఏడాది తెలుగులో ‘అనగనగా ఒక ధీరుడు’లో నటించారు శృతిహాసన్. రెండూ పెద్దగా ఆడలేదు. తెలుగులో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ ఆమెకు తొలి హిట్. ఇక అప్పట్నుంచి వెనక్కు తిరిగి చూసుకునే అవసరం రాలేదు శృతిహాసన్‌కి.
నటిగా, సంగీత దర్శకురాలిగా, గాయనిగా వెండితెరపై బహుముఖ ప్రజ్ఞ చాటుతూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారామె. విజయ్‌సేతుపతితో ఆమె నటించిన ‘ట్రైన్’ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా జరిగిన ఓ భేటీలో ఆమె మాట్లాడుతూ ‘సినిమాని మాత్రమే కాదు.. మనుషులని, మనసులని, వ్యక్తిత్వాలని సైతం అర్థం చేసుకునే పరిణతిని ఈ 17ఏండ్ల ప్రయాణం నాకిచ్చింది.
ఇప్పుడు నేను ఎలాంటి విమర్శలనైనా ఎదుర్కొనగలను. ఆ మానసిక ధృఢత్వాన్ని కూడా ఈ 17ఏండ్ల ప్రయాణమే ఇచ్చింది. ఇండస్ట్రీలోకి రాకముందు సినిమా విజయంలో నటుల పాత్రే కీలకం అనుకునేదాన్ని. కానీ ఆ విజయం వెనుక 24 శాఖల కష్టం ఎంత ఉందో నటిని అయ్యాక అర్థమైంది’ అన్నారు శృతిహాసన్.