‘మూడేళ్లయింది నేను సినిమాలు చేసి. అయినా మీ నుంచి అదే ప్రేమ. వెలకట్టలేని అభిమానం ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాతకు ఎంత స్ట్రెస్ ఉంటుందో ఈ సినిమా ద్వారా తెలిసింది. నిద్రను కూడా దూరం చేసుకొని అంతా ఈ సినిమాకు పనిచేశారు. వారివల్లే ఈ పాత్రను సమర్ధవంతంగా పోషించగలిగాను. టెక్నికల్‌గా అన్ని విధాలా సినిమా బావుంటుంది. ఇందులో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. పాటలు బావుంటాయి. కచ్చితంగా ఈ బంగారం అందరికీ నచ్చుతుంది’ అని అగ్ర నటి సమంత అన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి నిర్మించిన యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’.
నందినీరెడ్డి దర్శకత్వం వహించిన ఈచిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో సమంత మాట్లాడారు. డైరెక్టర్ నందినీరెడ్డి మాట్లాడుతూ ‘నా లైఫ్‌లో ఇంతకష్టపడ్డ సినిమా లేదు. టీమ్ వల్లే ఇంత త్వరగా సినిమా చేయగలిగాను. ఈ నెల 19న థియేటర్లలో సమంత విశ్వరూపం చూస్తారు’ అని నమ్మకంగా చెప్పారు. ఇంకా సంగీత విధ్వాంసురాలు శోభారాజ్, డి.సురేశ్‌బాబు, రాజ్ నిడుమోరు, డీకే, దేవకట్టా, స్వప్నదత్, వై.రవిశంకర్, శ్రీముఖి, చిన్మయి, రాహుల్ రవీంద్రన్, శ్రీలక్ష్మిలతోపాటు చిత్రబృందమంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..