సమంత టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘యశోద’. హరి-హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ నెల 11న విడుదలకానుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేశారు. మంగళవారం యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర యాక్షన్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన యానిక్బెన్ మాట్లాడుతూ ‘యాక్షన్ ఘట్టాలు రియల్‌గా ఉండాలని కోరుకుంటా. ఈ సినిమాలో యాక్షన్ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. కిక్ బాక్సింగ్, జూడో, మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్‌తో కలిసి యాక్షన్ సీన్స్ డిజైన్ చేశాం. సమంత ఎంతో అంకితభావంతో శ్రమిస్తుంది. ఎప్పుడూ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. యాక్షన్ సీన్స్‌కు ముందు స్టంట్ పర్ఫార్మర్లతో ఫైట్ కంపోజిషన్ చూపిస్తాం. ఆ తర్వాత నటీనటులకు ట్రైనింగ్ ఇస్తాం.
ఈ సినిమా యాక్షన్ ఘట్టాల్లో సమంత అద్భుతమైన శక్తిసామర్థ్యాల్ని ప్రదర్శించింది’ అన్నారు. వరలక్ష్మీశరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్ మురళీశర్మ, సంపత్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ-డా॥ చల్లా భాగ్యలక్ష్మి, ఫైట్స్: వెంకట్, యానిక్బెన్, దర్శకత్వం: హరి-హరీష్.