సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యశోద’. హరి-హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో సమంతతో పాటు కల్పికా గణేష్, దివ్యశ్రీపాద, ప్రియాంక శర్మ కీలక పాత్రల్లో నటించారు. తమ పాత్రలకు మంచి స్పందన వస్తున్నదని వారు ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో దివ్యశ్రీపాద మాట్లాడుతూ ‘సరోగసీ కథతో సినిమా అనగానే ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. నేను పోషించిన లీల పాత్ర ఎంతో సంతృప్తినిచ్చింది. నా నటన బాగుందని సమంత మెచ్చుకున్నారు. అదే బెస్ట్ కాంప్లిమెంట్ అనుకుంటున్నా’ అన్నారు.
‘ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, ఎమోషన్స్ ప్రతీ అంశం బాగా కుదిరింది. ఇలాంటి కథలు ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశ్యంతో ప్రెగ్నెంట్ లేడీ క్యారెక్టర్‌కు ఒప్పుకున్నా. సినిమాలోని సందేశం అందరికి చేరువకావడం ఆనందంగా ఉంది’ అని కల్పికా గణేష్ చెప్పారు. ప్రియాంక శర్మ మాట్లాడుతూ ‘ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. గర్భవతులుగా కనిపించడం కోసం మేమంతా సిలికాన్ బెల్లీ ఉపయోగించాం. గొప్ప కథలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది.