Samantha |అభిమానులు తమ అభిమాన స్టార్స్ పట్ల అమితమైన ప్రేమని పెంచుకుంటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రేమని వ్యక్త పరుస్తుంటారు. కొందరు పాలాభిషేకాలు చేయడం, ఇంకొందరు వారి పేరుతో దాన ధర్మాలుచేయడం వంటివి చేస్తుంటారు. అయితే అభిమానం మరింత ఎక్కువైతే వారికి గుడులు కట్టి ఏకంగా పూజలు కూడా చేస్తుంటారు. గతంలో తమిళనాట హీరోయిన్స్ ఖుష్బు, నమితలకు గుడి కట్టారు అభిమానులు. అయితే అక్కడ సెలబ్రిటీలపై వారికి అభిమానం ఎక్కువ. అందుకే అప్పట్లోనే గుడులు కట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద స్టార్ హీరో, హీరోయిన్స్‌కి గుడులు కట్టిన సందర్భాలు చాలా తక్కువ. కాని తొలిసారి సందీప్ అనే వ్యక్తి సమంతకి గుడి కట్టి హిస్టరీ క్రియేట్ చేశాడు.
బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన కార్ డ్రైవర్ సందీప్ సమంతకు వీర అభిమాని కాగా, ఆమెపై అతనికి ఉన్న అభిమానం గుడి రూపంలో చూపించాడు. తన ఇంటి ఆవరణలోనే గుడి కట్టి నిత్యం ఆమెకి పూజలు చేస్తున్నాడట. సమంత మంచి మనసుకి నేను ఫిదా అయ్యాను. ఆమె ఎందరికో ఎన్నో సహయసహకారాలు అందజేస్తుంది. అందుకే నేను ఆమెకి వీరాభిమాని అయ్యాను అని చెప్పుకొచ్చారు. అయితే సొంత డబ్బులతో అతను సమంతకి గుడి కట్టడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో నటీనటులకి గుడి కట్టింది లేదు. సమంతకి ఇలా గుడి కట్టడంతో ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
2010లో వచ్చిన ఏంమాయ చేశావో సినిమా నుండి సమంత వీరాభిమానిగా మారాడట సందీప్. ఇక ఆమెని రెగ్యులర్‌గా ఫాలో అవుతాడట. ఆమె చేసే మంచి పనులు, సినిమాలు అన్నింటి గురించి తెలుసుకుంటాడట. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో సమంత చూపిన చొరవ.. ఇతర సేవా కార్యక్రమాలకు ఫిదా అయి తన కోసం ఏదో ఒకటి చేయాలని గుడి కట్టాడట. 2023లో సమంత బర్త్ డే రోజున ఈ గుడి ఆవిష్కరణ జరిగింది. అయితే తాజాగా సమంత గుడికి సంబంధించిన కొన్ని విజువల్స్ బయటకు రాగా, దానిని అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ‘ఖుషి’ చిత్రం తర్వాత ఆమె కొత్త తెలుగు ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ప్రస్తుతం తన నిర్మాణంలోనే ఓ సినిమా చేస్తుంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.