మహాభారత ఇతిహాసం ఆదిపర్వంలోని శకుంతల-దుష్యంతుల అపురూప ప్రణయగాథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. అగ్ర నాయిక సమంత టైటిల్ రోల్‌ని పోషిస్తున్నది. పాన్ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. సోమవారం సమంత ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె ధవళ వర్ణ వస్ర్తాలను ధరించి అద్భుత సౌందర్యరాశిగా కాంతులీనుతున్నది. ముని కన్యగా ఆశ్రమంలో ఎవరికోసమో నిరీక్షిస్తూ కనిపిస్తున్నది. ప్రకృతిశోభతో అలరారే ఉద్యానవనంలో కొలువుదీరిన శకుంతల చుట్టూ అందమైన నెమళ్లు, జింకలు నిలుచుని ఉన్నాయి. చక్కటి కవితాత్మక భావనలు స్ఫురించేలా ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటున్నది. ‘తెలుగు చిత్రసీమలో ఇప్పటివరకు రానటువంటి మనోహర ప్రణయగాథ ఇది. గ్రాఫిక్స్ హంగులతో ప్రేక్షలకు సరికొత్త వీక్షణాభూతిని అందిస్తుంది. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శేఖర్ వి జోసెఫ్, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, ప్రొడక్షన్ డిజైనింగ్: అశోక్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాత: నీలిమా గుణ, నిర్మాణ సంస్థలు: డీఆర్పీ-గుణ టీమ్ వర్క్స్, సమర్పణ: దిల్ రాజు, రచన-దర్శకత్వం: గుణశేఖర్.