Samantha | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమంత, మహిళల స్థితిగతులపై తన మనసులోని భావాలను బహిరంగంగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ గుర్తింపు కోసం మహిళలు ప్రతిదానికీ రెట్టింపు కష్టపడాల్సి వస్తోంది అని పేర్కొంది. సినిమా రంగంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను వివరంగా చెబుతూ, వారి పోరాటం ఎంత కఠినంగా ఉంటుందో వెల్లడించింది.
సమాజంలో ఇతరులు సౌకర్యంగా ఉండటానికి మహిళలు తమ అభిప్రాయాలు, షెడ్యూళ్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారని సమంత ఆవేదన వ్యక్తం చేసింది. తమ ఆశయాలను వదులుకుంటూ వెనక్కి తగ్గడం మహిళలకు అలవాటైపోయింది అని ఆమె అన్నారు. ఇంకా ముందుకు వెళ్లి, మహిళలు తమ త్యాగాలను కూడా గుర్తించకుండా జీవిస్తున్నారని సమంత పేర్కొంది. “తమ వ్యక్తిత్వాన్ని త్యాగం చేసి, ఇతరుల కోసం జీవించడం ఒక సాధారణ విషయంగా మారిపోయింది అని ఆమె అభిప్రాయపడింది.
పురుషుల కంటే మహిళలు ఎక్కువగా క్షమాపణలు చెబుతారని చెప్పిన సమంత, ప్రతిదానికీ సారీ చెప్పడం ఇకనైనా ఆపాలి” అంటూ గట్టిగా పిలుపునిచ్చింది. మహిళలు తమ స్థానాన్ని అర్హతతో సంపాదించుకున్నారని, అందుకే ఎవరో ప్రశంసించినప్పుడు దాన్ని గర్వంగా స్వీకరించాలని సూచించింది. భవిష్యత్తుపై తన ఆశయాన్ని వ్యక్తం చేస్తూ, సినిమాలను ‘ఫీమేల్ లీడ్’ అంటూ ప్రత్యేకంగా ట్యాగ్ చేయాల్సిన అవసరం లేని రోజు రావాలని ఆమె ఆకాంక్షించింది. “మహిళా పాత్రలు కేవలం హీరోకు సపోర్ట్ చేసే స్థాయిలో కాకుండా, స్వతంత్రంగా నిలబడాలి” అని స్పష్టం చేసింది. షూటింగ్ సెట్స్‌లో భద్రతపై కూడా సమంత దృష్టి సారించింది. అది ఒక చర్చాంశం కాకుండా పరిశ్రమకు ప్రాథమిక ప్రమాణంగా మారాలని, ప్రతి మహిళా నటి సెట్లో సురక్షితంగా ఉన్నామనే భావనతో పని చేయాలని ఆమె పేర్కొంది.