Samantha | సమంత ప్రస్తుతం సిడ్నీ పర్యటనలో ఉన్నారు. అక్కడ జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెరీర్ గురించీ, సక్సెస్ గురించీ సమంత ఆసక్తికరంగా మాట్లాడారు. ‘ఒడిదుడుకుల నడుమ కెరీర్‌ను సాగించడం.. విజయం సాధించడం.. ఈ పరిణామాన్ని నేనేం గొప్పగా భావించను. సామాజిక పట్టింపులు, కట్టుబాట్ల నుంచి విముక్తి పొందడమే ఒక స్త్రీ నిజమైన విజయం. నచ్చినట్టు బతకడం సక్సెస్. అభిరుచికి తగ్గట్టు పనులు చేయడం సక్సెస్. నిజజీవితంలో పోషించే ప్రతి పాత్రనూ సమర్ధవంతంగా రాణించగలగడమే సక్సెస్.
ఆ విషయంలో ఒక స్త్రీగా నన్ను చూసుకొని నేను గర్విస్తా. ఇక కెరీర్ పరంగా నేనేంటో అందరికీ తెలుసు. కానీ ఒక్క నటిగా మాత్రమే మిగిలిపోకూడదనే నిర్మాణ సంస్థ మొదలుపెట్టా. వినూత్నమైన కథలను, కొత్త టాలెంట్‌ను సమాజానికి అందించాలనే దృక్పధంతోనే నిర్మాతగా మారాను.’ అని తెలిపారు సమంత. ఈ పర్యటనలోనే అక్కడి యువతతో ఆమె మాట్లాడుతూ ‘చదువుకునే రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్లాలని కలలు కనేదాన్ని. సిడ్నీ యూనివర్సిటీలో చదువుకోవాలని ఆశపడేదాన్ని. కానీ ఆ ఒక్క కోరిక అప్పుడు తీరలేదు. ఇదిగో.. ఇప్పుడు ఇలా తీర్చాడు దేవుడు.’ అంటూ అందంగా నవ్వేశారు సమంత.