కీర్తిప్రతిష్టలకు అతీతంగా.. స్వేచ్ఛగా జీవితాన్ని గడపటమే నిజమైన విజయమని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. గత రెండేళ్లుగా తాను నటించిన సినిమాలు రాలేదని, ఈ సంధికాలంలో తానెంతో పరిణితి సాధించానని పేర్కొంది. తాజా ఇంటర్వ్యూలో ఈ భామ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. జీవితం తాలూకు ఒకే వృత్తానికి పరిమితం కాకుండా స్వేచ్ఛగా వృద్ధిలోకి రావడం, పరిణితి సాధించడం అన్నింటికంటే ముఖ్యమని చెప్పుకొచ్చింది. ‘ఖుషి’ తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రమేది విడుదల కాలేదు.
ఆమె నిర్మించిన ‘శుభం’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో సమంత అతిథి పాత్రలో కనిపించింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల విరామం తీసుకోవడానికి గల కారణాలను సమంత వివరించింది. ఇప్పుడు నాకు విజయాలు లేవని చాలా మంది భావిస్తున్నారు కావొచ్చు. కానీ గతంలో కంటే ఇప్పుడే నేను బాగున్నా. ప్రతీ రోజు ఉత్సాహంగా నిద్రలేస్తున్నా. జీవితాశయం దిశగా స్పష్టంగా ఆలోచిస్తున్నా. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడే నేను ఉన్నతమైన విజయాలను ఆస్వాదిస్తున్నా’ అని సమంత చెప్పింది. ప్రస్తుతం స్వీయనిర్మాణంలో సమంత ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రంలో నటిస్తున్నది. హిందీలో ‘రక్త్ బ్రహ్మాండ్’ సిరీస్‌తో ముందుకురానుంది.