సినీరంగంలో తాను పడిన కష్టానికి ఫలితంగానే వేల మంది అభిమానుల్ని సంపాదించుకున్నానని, వాళ్లను దేవుడిచ్చిన వరంగా భావిస్తానని అగ్ర కథానాయిక సమంత చెప్పింది. చెన్నైలో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన కోలీవుడ్ గోల్డెన్ క్వీన్ పురస్కారాల్లో సమంత గోల్డెన్ క్వీన్‌గా అవార్డునందుకుంది. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్‌తో పాటు కష్టకాలంలో వెన్నంటి వున్న ఆత్మీయుల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది. కేవలం ఏదో ఒక తప్పుడు నిర్ణయం వల్ల కెరీర్ ప్రభావితం అవుతుందన్నది అబద్ధమని, సరైన అవగాహన లేకుండా తీసుకునే ఎన్నో నిర్ణయాలు కెరీర్ గమనాన్ని నిర్ధేశిస్తాయని తెలిపింది. తన ఆరోగ్యం బాగా లేనప్పుడు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఎంతో కేర్ తీసుకున్నాడని, తమ అనుబంధానికి పేరు పెట్టలేనని సమంత ఎమోషనల్ అయింది. ‘కష్టకాలంలో రాహుల్ నావెంటే ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటూజాగ్రత్తగా చూసుకున్నాడు. అతను నా స్నేహితుడు, సోదరుడు, కుటుంబ సభ్యుడు లేదా రక్త సంబంధీకుడా అని చెప్పలేను. అంతటి బలమైన అనుబంధం మాది’ అని సమంత పేర్కొంది. ప్రస్తుతం సమంత హిందీలో ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నది.