Samantha | గత నెల 15న కేరళలో తోటి విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా సమంత ఈ విషాదంపై తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి బయటకు వెల్లడిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయంతో చాలామంది మౌనంగానే బాధపడుతున్నారు.
నిజానికి మనం అక్కడే విఫలం అవుతున్నాం. బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే, వాటి గురించి బయటకు వెల్లడించాలి. అప్పుడే సమాజం అండ లభిస్తుంది. అప్పుడే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారిని మనం ఎదుర్కోగలం. అసలు మనం ఎక్కడున్నాం!?. సమాజం మానసికంగా ఎంతో ఎదుగుతున్నా కూడా కొందరు మాత్రం మనసుల్లో ద్వేషమనే విషాన్ని నింపుకొని బతుకుతున్నారు. అలాంటి వ్యక్తుల కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు.
సాటి మనిషిని హేళనగా చూడటం.. ర్యాగింగ్‌లకు తెగబడటం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన చెబుతున్నది. మన దగ్గర కఠినమైన చట్టాలున్నాయి. వాటిని మరింత కఠినతరం చేయాలి. ఘటనపై క్షుణ్ణంగా పరిశీలించి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. సమాజానికి నేను చెప్పేదొక్కటే.. దయచేసి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్ట్‌గా నిలవండి.. ప్లీజ్..’ అంటూ ఉద్వేగంగా స్పందించారు సమంత.