Samantha | టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ సత్తా చాటిన నటి సమంత ఇప్పుడు నటి మాత్రమే కాదు, నిర్మాతగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతోంది. 2010లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏం మాయ చేసావే’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన సమంత, తొలి సినిమాతోనే నంది అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్ గెలుచుకొని అశేష గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత వరుస విజయాలు దక్కించుకున్న ఈ భామ బృందావనం, దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది, రంగస్థలం, మజిలీ లాంటి చిత్రాలతో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది.
ఇక ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో రాజీ పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో సమంత మయోసైటిస్ బారిన పడింది. దాంతో కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన సమంత, కోలుకుని మళ్లీ కెరీర్లో బిజీ అయింది.. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్‌తో కలిసి ‘సిటాడెల్’ అనే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ మధ్యే ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై ‘శుభం’ అనే సినిమాను నిర్మించి సక్సెస్ సాధించింది. ఇది సమంత నిర్మాతగా చేసిన తొలి సినిమా కావడం విశేషం.
సమంత ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ అనే మరో చిత్రాన్ని నిర్మిస్తూ, నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకునే క్రమంలో ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే ఫాంటసీ వెబ్‌సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవకతవకలు జరిపినట్లు వార్తలు రావడంతో దీనిపై మేకర్స్ స్పందించారు. దీనిని ఎన్నో షెడ్యూల్స్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాం. ఇండోర్ టాకీ షెడ్యూల్ పూర్తి చేశాం. ఔట్ డోర్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేశాం. అనుకూలమైన వాతావరణం కోసం ఎదురు చూస్తున్నాము. వర్షాలు పడడంతో పాటు పచ్చదనం అవసరం ఉంది. అందుకే కొద్ది రోజులు ఆగి ఈ షెడ్యూల్‌ని ప్రారంభిస్తాము అని చెప్పుకొచ్చారు. దీంతో పుకార్లకి పులిస్టాప్ పడ్డట్టు అయింది.