సమంత ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటుంది. తన ఫిట్నెస్ వీడియోలను తరచూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో తాత్వికతను ప్రతిబింబించే కొటేషన్స్‌తో అభిమానులకు ప్రేరణనిస్తుంది. తాజా ఇంటర్వ్యూలో ఈ భామ తన జీవితాన్ని బాగా ప్రభావితం చేసిన ఓ మంచి అలవాటు గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. అనారోగ్యం బారిన పడిన తర్వాత తన జీవనశైలిలో చాలా మార్పులు చేసుకున్నానని, అన్నింటికంటే ముఖ్యంగా ఓ మూడు రోజులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండటం వల్ల ఎప్పుడూ లేనంతగా మానసిక ప్రశాంతత లభించిందని చెప్పింది.
‘ఓ సందర్భంలో మూడు రోజుల పాటు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని బలంగా నిర్ణయించుకున్నా. సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసిపెట్టా. మొదట కొంత ఇబ్బందిగా అనిపించినా తర్వాత మెల్లగా అలవాటైంది. నాలో ఏదో తెలియని ప్రశాంతత మొదలైందనే భావన కలిగింది. మెదడు చురుగ్గా పనిచేసింది. నిర్ణయాల విషయంలో స్పష్టత వచ్చింది. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంటే ఇంత ప్రశాంతంగా ఉండొచ్చా అని నేను ఆశ్చర్యపోయా’ అని చెప్పుకొచ్చింది సమంత. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో నటిస్తున్నది.