Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇటీవల సినిమాలు తగ్గించి, హెల్త్, వెల్నెస్, వ్యక్తిగత శ్రేయస్సుపై ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. అయితే సోషల్ సమస్యలపై స్పందించడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. అయితే ఆన్లైన్ వేధింపులకి వ్యతిరేఖంగా సమంత ఐక్యరాజ్య సమితితో కలిసి పని చేయనున్నారు. తాజాగా మహిళలపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులను అరికట్టేందుకు సమంత మరోసారి సోషల్ స్పేస్‌లో బలమైన సందేశం ఇచ్చింది. యూఎన్ విమెన్ ఇండియా నిర్వహిస్తున్న NO Excuse క్యాంపెయిన్‌కు సమంత అంబాసడర్‌గా చేరారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు జరిగే ఈ 16 రోజుల కార్యక్రమం లక్ష్యం మహిళలపై హింసను నిర్మూలించడం, ముఖ్యంగా ఆన్లైన్లో పెరుగుతున్న వేధింపులను అరికట్టడం. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనడం అవసరమని, అందరూ తనతో చేరాలని కోరుతూ సమంత ఒక శక్తివంతమైన అవేర్నెస్ వీడియోను షేర్ చేశారు.
ఆ వీడియోలో సమంత మాట్లాడుతూ ..హింస అంటే మనం వీధుల్లో, ఇళ్లలో, వర్క్ ప్లేస్‌లో జరుగుతుందని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఇది ఆన్లైన్లో విపరీతంగా పెరిగింది. ముగ్గురిలో ఒక మహిళ ఏదో ఒక రకమైన డిజిటల్ హింసను ఎదుర్కొంటోంది. ట్రోలింగ్ , వెంబడించడం, డీప్ ఫేక్‌లు, టాక్సిక్ కామెంట్స్… ఇవన్నీ ఒక కామెంట్‌తో మొదలై ఒకరి జీవితాన్ని నాశనం చేసే స్థాయికి చేరుతాయి. చాలా మంది మహిళలు కెరీర్‌ను, కాన్ఫిడెన్స్‌ను కోల్పోయారు. ఆన్లైన్ అబ్యూస్ను జోక్‌గా చూడడం ఆపాలి. అప్పుడు మాత్రమే ఇంటర్నెట్ మహిళలకు సేఫ్‌గా మారుతుంది” అని స్పష్టం చేశారు.
సమంత ఈసారి వ్యక్తిగత అనుభవాలను కూడా సూచించిందని అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆమెపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్, ఫేక్ న్యూస్, ఆన్లైన్ ట్రోలింగ్ ఆమె వ్యక్తిగత జీవితానికే కాదు తన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. సమాజంలో నిజమైన మార్పు రావాలంటే ఇలాంటి ప్రజాదరణ ఉన్న స్టార్లు ముందుకు రావడం చాలా అవసరం. ఈ క్యాంపెయిన్‌తో సమంత మరోసారి ప్రతిభావంతమైన నటి మాత్రమే కాకుండా బాధ్యతాయుతమైన పౌరురాలిగా నిలిచారు.