Samantha Hollywood Project | ‘ఏ మాయ చేశావే’ సినిమాతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది సామ్. ఆ తర్వాత ‘బృందావనం’, ‘దూకుడు’, ‘ఈగ’ వరుస పెట్టి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ హీరోలకు లక్కీ చార్మ్ అయిపోయింది. దాదాపు దశాబ్ద కాలం పాటు దక్షిణాది అగ్ర హీరోయిన్గా సమంత చక్రం తిప్పింది. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంది. త్వరలో విడుదల కానున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌తో సామ్ క్రేజ్ మరింత పెరగడం ఖాయం. ఇప్పటికే విడుదలైన ఆమె పోస్టర్ కు దక్షిణాది ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇక తాజాగా ఈ చెన్నై సొగసరి హాలీవుడ్ ప్రాజెక్ట్ ఓకే చేసింది. అంతేకాకుండా ఈ సినిమాకు’ చెన్నై స్టో్రీ’ అనే టైటిల్ కూడా ఖరారైనట్లు సమాచారం. పలు హాలీవుడ్ టెలివిజన్ షోలకు పనిచేసిన ఫిలిప్ జాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇంగ్లాండ్ నటుడు వివేక్ కల్రా హీరోగా నటించనున్నాడు. ఇక ఈ సినిమా కథ మొత్తం లండన్‌లో స్థిరపడ్డ భారతీయ మూలాలున్న ఒక ఇంగ్లీష్ యువకుని చుట్టు సాగుతుందట. హీరో తన తండ్రిని వెతుక్కుంటూ చెన్నై వస్తాడు. అక్కడ తనకి ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. హీరో తండ్రిని వెతకడానికి హీరోయిన్ సాయం చేయడానికి ఒప్పుకుంటుంది. తర్వాత వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది అన్న ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతన్న ఈ సినిమాను విల్ మచిన్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఈ సినిమా షూటింగ్ బ్రిటన్ తో పాటు చెన్నైలోనూ జరుగనుందట. ముందుగా ఈ సినిమాను హాలీవుడ్ లో రిలీజ్ చేసి ఆ తర్వాత ఇండియాలో అన్ని భాషల్లో విడుదల చేయనున్నారట. కాగా సమంతకు ఇదే తొలి హాలీవుడ్ సినిమా. ప్రస్తుతం సమంత ఖుషీ సినిమాలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, నా రోజా నువ్వే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది.