అగ్ర కథానాయిక సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. సోమవారం ఉదయం కోయంబత్తూర్‌లోని ఈశా ఫాండేషన్లోని లింగభైరవి ఆలయంలో దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత పెళ్లిపీటలెక్కింది. వీరిద్దరికిది రెండో వివాహం. కొద్ది మంది కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లి వేడుక నిరాడంబరంగా జరిగింది. వివాహ ఘట్టం పూర్తయిన కొద్దిసేపటికే సమంత తన పెళ్లి ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. పెళ్లిలో సమంత జరీ వర్క్ కలబోసిన ఎరుపు రంగు చీరలో మెరిసిపోయింది. కొత్త జంట చిరునవ్వులు చిందిస్తూ ఉల్లాసభరితంగా కనిపించారు.
సమంత-రాజ్ నిడిమోరు భూత శుద్ధి సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఈశా యోగా కేంద్రంలో సద్గురు ప్రాణప్రతిష్ట చేసిన లింగ భైరవి విగ్రహం ముందు భూత శుద్ధి విధానంలో పెళ్లి జరిపించారు. భావోద్వేగాలు, భౌతికపరమైన అంశాలకు అతీతంగా దంపతులు మధ్య ప్రగాఢ బంధాన్ని ఏర్పరచడానికి తయారుచేసిన విశిష్టమైన విధానమే ఈ భూత శుద్ధి వివాహమని ఈశా ఫాండేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. పంచభూతాలను శుద్ధి చేసి వివాహబంధంలో అన్యోన్యత, ఆధ్యాత్మికత, మనశ్శాంతి వెల్లివిరిసేలా చేయడమే ఈ భూత శుద్ధి విధానంలోని పరమార్థమని ఈశా ఫాండేషన్ తెలియజేసింది.
‘ఫ్యామిలీమెన్-2’ సిరీస్‌లో సమంత నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు రాజ్-డీకే ద్వయం దర్శకత్వం వహించారు. ఆ సమయంలోనే సమంత-రాజ్ నిడిమోరు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సమంత తన సోషల్‌మీడియాలో పంచుకోవడంతో వీరిద్దరి డేటింగ్ వార్తలకు బలం చేకూరింది. సమంత నిర్మించిన ‘శుభం’ చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో సమంత-రాజ్ సందడి చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. చివరకు ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు.