Salman – Prabhas | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రతి ఈద్ పండుగకు తన సినిమాలను విడుదల చేయడం చాలా కాలంగా వస్తున్న ట్రెండ్. మధ్యలో కొన్నేళ్లు గ్యాప్ వచ్చినా, మళ్లీ అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. 2027 ఈద్ సందర్భంగా అభిమానులకు భారీ కానుక ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ తన తదుపరి సినిమాను ప్రముఖ తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న విషయం ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ హై-స్కేల్ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 14 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ముంబైలోని గోరేగావ్‌లో ప్రత్యేకంగా ఒక మినీ సిటీ సెట్‌ను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. విజువల్‌గా కూడా ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఆసక్తికర అంశం ఏంటంటే బాక్సాఫీస్ పోటీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం స్పిరిట్ ఇప్పటికే 2027లో విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ విడుదల తేదీ మారి ఈద్‌కు వస్తే, సల్మాన్ సినిమా తో భారీ పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి.
ఇద్దరూ దేశంలోనే అగ్ర తారలు కావడంతో, ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలైతే బాక్సాఫీస్ వద్ద చారిత్రాత్మక పోటీ నెలకొనడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇంత పెద్ద ప్రాజెక్టులు ఒకేసారి ఢీకొనకుండా మేకర్స్ జాగ్రత్త పడే అవకాశమూ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి, 2027 ఈద్ బాక్సాఫీస్ పోరాటం ఇప్పటి నుంచే హాట్ టాపిక్‌గా మారింది. సల్మాన్ ఖాన్ తన మాస్ అప్పీల్‌తో మరోసారి థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధమవుతుండగా, ప్రభాస్‌తో ఎదురెదురైతే అది ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ క్లాష్‌గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.