ఇటీవల అబుదాబిలో జరిగిన ‘ఐఫా 2022’ వేడుకల్లో సల్మాన్ ఖాన్ ప్రవర్తన వివాదాస్పదం అవుతున్నది. ఈ వేడుకల్లో వ్యాఖ్యాత సిద్ధార్థ్ కన్నన్ను వేదిక మీదే సల్మాన్ కించపరిచేలా మాట్లాడారు. వ్యాఖ్యాతగా సిద్ధార్థ్ కన్నన్ మాట్లాడుతుండగా వేదిక మీదకు వచ్చిన సల్మాన్…‘ఇతడు మనల్ని విసిగించి చంపేస్తున్నాడు. ఇతన్ని ప్రతిసారి వ్యాఖ్యాతగా ఎందుకు తీసుకొస్తారో అర్థం కాదు’ అని అన్నారు. ఈ వీడియో ఇప్పుడు బయటకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వ్యాఖ్యాతను సల్మాన్ అవమానించారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. పొగరుగా ప్రవర్తించారని, ఆయన హుందాగా ఉండాల్సింది అని కామెంట్స్ రాస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, షాహిద్ కపూర్, సారా అలీ ఖాన్, టైగర్ ష్రాఫ్, అనన్య పాండే తదితర బాలీవుడ్ తారలు పాల్గొన్నారు.