ముంబై : భారత్, చైనా బోర్డర్లో అయిదేళ్ల క్రితం గల్వాన్‌లో ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ రియల్ కథ ఆధారంగా బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్రాన్ని తీస్తున్నారు. ఆ ఫిల్మ్‌లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) నటిస్తున్నాడు. అయితే ఆ ఫిల్మ్ ముంబై షెడ్యూల్‌ను అర్థాంతరంగా ఆపేశారు. ఈ నెలలో ముంబైలో జరగాల్సిన షూటింగ్‌ను అకస్మాత్తుగా నిలిపేశారు. బాంద్రాలో ఉన్న మెహబూబ్ స్టూడియోలో వేసిన సెట్లను తొలగించేశారు. షూటింగ్‌ను రద్దు చేశారు. కొన్ని కారణాల వల్ల షూటింగ్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫిల్మ్‌కు చెందిన మరో షెడ్యూల్‌ను ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు లడాఖ్‌లో షూట్ చేయనున్నారు. ఆ షెడ్యూల్లో ఎక్కువగా యాక్షన్ సీన్స్‌పై దృష్టిపెట్టనున్నారు.
ఫిల్మ్ నిర్మాణం విషయంలో రక్షణశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సినీవర్గాలు పేర్కొన్నాయి. రక్షణశాఖ ఇచ్చిన పూర్తి పర్మిషన్‌తోనే షూటింగ్ ప్రారంభించినట్లు నిర్మాతలు చెబుతున్నారు. భారతీయ సైనికుల ధైర్యసాహసాలను ఆ ఫిల్మ్‌లో చూపించనున్నారు. దేశాన్ని నెగటివ్‌గా చిత్రీకరించడం లేదని మేకర్స్ చెప్పారు. అనుమతులు లేకుండా నిర్మాతలు ఫిల్మ్‌ను ప్రకటించేవాళ్లు కాదు అని ఓ మీడియా కథనం పేర్కొన్నది. సల్మాన్ ఖాన్‌తో పాటు చిత్రాంగద సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఫిల్మ్‌లో జెన్ షా, అంకుర్ భాటియా, హర్షిల్ షా, హీరా సోహల్, అభిలాశ్ చౌదరీ, విపిన్ భరద్వాజ్ నటిస్తున్నారు.
2020 జూన్‌లో జరిగిన గల్వాన్ ఘర్షణ ఆధారంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లడాఖ్‌లోని గల్వాన్ లోయలో రెండు దేశాలకు చెందిన సైనికులు తీవ్రంగా కొట్టుకున్న విషయం తెలిసిందే. గన్స్ కాకుండా కేవలం రాళ్లు, ఇనుప కర్రెలతో సైనికులు ఫైట్ చేశారు.