భారత్-చైనా సైనికుల మధ్య లద్దాఖ్ సరిహద్దులోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లాఖియా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటించబోతున్నారనే విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ తాలూకు మరిన్ని అప్డేట్స్ వెలువడ్డాయి. గాల్వాన్ పోరులో అమరుడైన సూర్యాపేట వాస్తవ్యుడు కర్నల్ బి. సంతోష్‌బాబు వీరోచిత గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
16 బీహార్ రెజిమెంట్‌కు నాయకత్వం వహిస్తున్న సమయంలోనే సంతోష్‌బాబు గాల్వాన్ లోయ ఘర్షణలో వీర మరణం పొందారు. మరణానంతరం భారత ప్రభుత్వం ఆయనకు రెండో అత్యున్నత శౌర్య పతకం మహావీర్ చక్రను ప్రకటించింది. దేశరక్షణలో కర్నల్ సంతోష్‌బాబు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలను ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నామని, రియల్ లొకేషన్లలో షూటింగ్ చేయబోతున్నామని, ఈ సినిమా కోసం సల్మాన్‌ఖాన్ శారీరకంగా మరింత ఫిట్‌గా తయారవుతున్నారని మేకర్స్ తెలిపారు. జియో స్టూడియో నిర్మించనున్న ఈ చిత్రం జూలైలో సెట్స్‌మీదకు వెళ్లనుందని సమాచారం.