Salman Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వరుస భారీ ప్రాజెక్ట్‌లతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. యాక్షన్, మాస్ ఎంటర్టైనర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సల్మాన్.. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన పాత్రల వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పీరియాడిక్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ‘రంగ్ దే బసంతీ’, ‘భాగ్ మిల్ఖా భాగ్’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన ఇటీవల సల్మాన్ ఖాన్‌కు ఒక భారీ పీరియాడిక్ కథను వినిపించినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కథలో చరిత్రలో ప్రముఖ స్థానం సంపాదించిన ఒక యోధుడి పాత్రను సల్మాన్ పోషించనున్నారని సమాచారం. కథ, పాత్ర రెండూ సల్మాన్‌ను బాగా ఆకట్టుకోవడంతో ఆయన వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. పాత్రకు తగ్గట్టుగా ప్రత్యేక శిక్షణ తీసుకోవడంతో పాటు కత్తిసాము, గుర్రపు స్వారీ వంటి అంశాల్లో కూడా శిక్షణ పొందనున్నట్లు సమాచారం.ఇప్పటి వరకు మాస్ హీరోగా, యాక్షన్ స్టార్‌గా కనిపించిన సల్మాన్.. ఈసారి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పాత్రలో ఎలా కనిపిస్తారో అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాత, నటుడు ఫర్హాన్ అక్తర్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.సల్మాన్ ఖాన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని భారీ ప్రాజెక్ట్‌లు ఆయన చేతిలో ఉండగా, వాటి షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ పీరియాడిక్ డ్రామా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2027లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఎన్నో మాస్ పాత్రలతో అభిమానులను అలరించిన సల్మాన్ ఖాన్.. ఇప్పుడు ఒక చారిత్రాత్మక యోధుడి పాత్రలో కనిపిస్తారనే వార్త అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.