Salman Khan | బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (gangster Lawrence Bishnoi) నుంచి వరుస హత్య బెదిరింపులు (death threats) వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కాలంలో సల్మాన్‌కు పలుమార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులపై సల్లూ భాయ్ తాజాగా స్పందించారు. తాను దేవుడిని నమ్ముతానని.. ఆ అల్లానే అన్నీ చూసుకుంటాడంటూ వ్యాఖ్యానించారు.
‘నేను దేవుడిని ఎక్కువగా నమ్ముతాను. ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఆయుష్షు ఉన్నంత కాలం జీవిస్తాను. ఈ బెదిరింపులతో ఇంటి వద్ద, షూటింగ్ లొకేషన్స్ ఇలా అన్ని చోట్లా నా చుట్టూ భద్రత పెరిగింది. కొన్ని సార్లు ఈ భద్రత కూడా సవాలుగా అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సల్మాన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
1998 కృష్ణ జింక కేసు నుంచి సల్మాన్ ఖాన్.. లారెన్స్ బిష్ణోయ్ గాంగ్ టార్గెట్ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ గ్యాంగ్ నుంచి సల్మాన్ అనేక సార్లు హత్య బెదిరింపులు ఎదుర్కొన్నాడు. గతేడాది ఏప్రిల్‌లో గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మోటారు బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సల్మాన్ ఇంటి ముందు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే జూన్‌లో మరోసారి సల్మాన్ హత్యకు కుట్ర జరిగింది. పన్వేల్ ఫామ్‌హౌస్ నుంచి ఇంటికి వెళ్తున్న మార్గంలో సల్మాన్‌పై దాడి చేయాలని ఈ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వరుస హత్య బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ పూర్తి భద్రతా వలయంలో ఉన్నారు.
తన వ్యక్తిగత రక్షణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ముంబయి పోలీసులు సల్మాన్‌కు వైప్లస్ భద్రతను సమకూర్చారు. మరిన్ని రక్షణ చర్యల్లో భాగంగా సల్మాన్‌ఖాన్ ముంబైలో నివాసంఉండే గెలాక్సీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌కు బుల్లెట్‌ఫ్రూఫ్ గ్లాస్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వరుస బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్‌ఖాన్ షూటింగ్స్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవుట్డోర్ షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సికందర్’ (Sikandar). ఈ మూవీ రంజాన్ కానుకగా ఈ నెల 30న విడుదల కానున్నది. ఈ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్ కీలకపాత్రలో కనిపించనున్నది. ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో సల్మాన్ వరుసగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.
Also Read..
“Salman Khan | ఆమె కూతురితో కూడా నటిస్తా.. రష్మికతో ఏజ్‌గ్యాప్‌పై సల్మాన్ స్ట్రాంగ్ కౌంటర్”
“Sikandar | మురుగదాస్‌ను ఎత్తుకున్న సల్మాన్ ఖాన్, అమీర్‌ఖాన్.. స్పెషల్ ఏంటో ?”