Anmol Bishnoi | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిదగ్గర జరిగిన కాల్పుల కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ తాజాగా ముంబై కోర్టును ఆశ్రయించాడు. జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడైన అన్మోల్.. ఈ కేసులో తాను స్వచ్ఛందంగా లొంగిపోవడానికి అనుమతించాలంటూ ముంబైలోని ప్రత్యేక ఎంసీఓసీఏ (MCOCA) కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలనే ఉద్దేశంతోనే తాను న్యాయపరమైన ప్రక్రియలో భాగస్వామి కావాలని అనుకుంటున్నట్లు తన దరఖాస్తులో పేర్కొన్నాడు. 2025 నవంబర్‌లో అమెరికా నుంచి భారత్‌కు అప్పగించబడిన అన్మోల్ బిష్ణోయ్, ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు. ఉగ్రవాద-గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌కు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అతనిని అరెస్ట్ చేయడంతో అప్పటినుంచి అక్కడే జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నాడు.
ఇక అన్మోల్ బిష్ణోయ్ దాఖలు చేసిన ఈ లొంగుబాటు పిటిషన్‌పై స్పందించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎస్.ఆర్. నవేందర్.. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించారు. తాను ఇప్పటికే ఎన్ఐఏ కేసులో జైలులో ఉన్నందున, కోర్టు నుంచి తగిన ఆదేశాలు, వారెంట్ లేకుండా ముంబై కోర్టు ముందు నేరుగా హాజరు కాలేనని అన్మోల్ తన పిటిషన్లో వివరించాడు. అందువల్ల తీహార్ జైలు అధికారులకు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేయాలని, భౌతికంగా లేదా వర్చువల్ విధానం ద్వారా తన లొంగుబాటును రికార్డు చేసి రిమాండ్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరాడు. తాను లొంగిపోవడం వల్ల ప్రాసిక్యూషన్‌కు ఎలాంటి నష్టం జరగదని, పైగా విచారణ వేగవంతం కావడానికి మరియు కాలయాపనను నివారించడానికి ఇది సహాయపడుతుందని కోర్టుకు విన్నవించాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసు విచారణ కొనసాగుతోందని, తన గైర్హాజరీలోనే ఇప్పటికే ముగ్గురు సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశారని అన్మోల్ పేర్కొన్నాడు.
2024 ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్స్ వెలుపల బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ దాడి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ ప్రకారమే జరిగిందని నిర్ధారించిన ముంబై పోలీసులు.. ఈ కేసులో కఠినమైన మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం (MCOCA) కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో షూటర్లు విక్కీ గుప్తా, సాగర్ పాల్‌తో పాటు సోనుకుమార్ బిష్ణోయ్, మహ్మద్ రఫీక్ చౌదరి, హర్పాల్ సింగ్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. మరో నిందితుడు అనుజ్ కుమార్… థాపన్ పోలీసు కస్టడీలో ఉండగానే మరణించాడు. కాగా, లారెన్స్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్‌లను ఈ కేసులో ప్రధాన మోస్ట్ వాంటెడ్ నిందితులుగా పోలీసులు చేర్చిన సంగతి తెలిసిందే.