బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ హీరోగా, టాలీవుడ్ డైరెక్టర్ పైడిపల్లి వంశీ దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్ రాజు ఓ పానిండియా బాలీవుడ్ చిత్రాన్ని నిర్మించనున్నట్టు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూవున్నాయి. ఇప్పటివరకూ కేవలం రూమర్ అనుకున్న ఈ వార్త ఎట్టకేలకు నిజమైంది. సోమవారం ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. తమ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందనున్నట్టు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ…సల్మాన్‌ఖాన్, పైడిపల్లి వంశీ కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేసింది.
నయనతార ఇందులో కథానాయికగా నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. అలాగే.. బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్‌కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభించి, 2027లో విడుదల చేయాలనే సంకల్పంతో మేకర్స్ ఉన్నారు. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ ‘మాతృభూమి’ అనే సినిమా చేస్తున్నారు. దానితో పాటే పైడిపల్లి వంశీ సినిమా షూటింగ్‌ను కూడా సమాంతరంగా నడిపించాలని సల్మాన్ భావిస్తున్నారట. దళపతి విజయ్ ‘వారసుడు’ తర్వాత పైడిపల్లి వంశీ చేస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.